రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్ అరెస్ట్
posted on May 1, 2025 @ 11:14PM
వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ మరొకరిని అరెస్టు చేసింది. ఈ కేసులో కీలక నిందితుడైన రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్ ను సిట్ అధికారులు గురువారం (మే 2) అరెస్టు చేశారు. దుబాయ్ పరారయ్యేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్న దిలీప్ ను సిట్ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సిట్ దిలీప్ కు నోటీసులు జారీ చేసింది. అయితే దిలీప్ విచారణకు హాజరు కాకుండా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ డిజిటల్, ఫోన్ లోకేషన్ ద్వారా ఆయన కదలికలపై నిఘా పెట్టిన సిట్ ఆయన చెన్నై విమానాశ్రయంలో ఉన్నట్లు గుర్తించింది. వెంటనే చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్న సిట్ అధికారులు దిలీప్ ను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కేసిరెడ్డి పీఏ నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ భావిస్తోంది. కమిషన్‌లు ఇచ్చే డిస్టలరీల యజమానులు దిలీప్ తమతో కాంటాక్ట్ లో ఉండేవాడని సిట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజ్ కేసిరెడ్డి, డిస్టలరీల యాజమాన్యాల మధ్య దిలీప్ అనుసంధానకర్తగా ఉండేవాడని చెబుతారు. ఇప్పుడు దిలీప్ ను అరెస్టు చేయడం ద్వారా కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.