ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులు వానలే వానలు!
posted on Jul 25, 2024 @ 11:31AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వచ్చే మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ముసురు పట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా పలు జిల్లాల్లో వాగులు, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. అయితే గురువారం జులై 25) నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లో (జులై 25, 36) ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇక తెలంగాణకూ భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం (జులై 25) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.