ఏపీలో రైల్వేలకు 9,151 కోట్లు!
posted on Jul 24, 2024 @ 7:08PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంవత్సరం రైల్వేలకు 9,151 కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన దానికంటే ఈ ఏడాది పదింతలు పెంచామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వంద శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగిందన్నారు. ఏపీలో 73,743 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.
"అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర 2,047 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించాం. రైల్వే పనులపై డీపీఆర్‌ని నీతి ఆయోగ్ ఆమోదించింది. మరికొన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశముంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు స్థలం కేటాయింపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. భూమి కేటాయించాలని అధికారులను ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు” అని కేంద్ర మంత్రి తెలిపారు.
అలాగే తెలంగాణాలో రైల్వే లైన్లు వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ జరిగాయి. రాష్ట్రంలో 32,946 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అమృత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లు పూర్తిగా అభివృద్ధి చెందాయని అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.