రైల్వే బడ్జెట్ పై పలువురి స్పందనలు..
posted on Feb 25, 2016 @ 5:25PM
కేంద్రమంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే బడ్జెట్ గురించి పలువురు పలు రకాలుగా స్పందించారు.
ప్రధాని మోడీ స్పందిస్తూ.. సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని.. భారత ఆర్థిక అభివృద్ధిలో రైల్వే బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంతేకాదు సురేశ్ ప్రభుతో పాటు యావత్ రైల్వే కుటుంబానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
వెంకయ్యనాయుడు:
ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సురేశ్ ప్రభు ప్రయాణికుల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. రైల్వే బడ్జెట్ ప్రయాణికుల సంతృప్తిపై దృష్టిసారించేలా ఉందన్నారు.
ప్రకాశ్ జావదేకర్..
ఇది అన్ని విధాలుగా మంచి రైల్వే బడ్జెట్ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ అన్నారు. సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కు తాను పదికి తొమ్మిది మార్కులు ఇస్తానని ప్రకాశ్ జావదేకర్ ట్వీట్ చేశారు.
సిపిఎం బివి.రాఘవులు..
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు రైల్వే బడ్జెట్ పై స్పందించారు. రైల్వే బడ్జెట్‌లో వాగ్దానాలే కనిపిస్తున్నాయి తప్పించి కొత్తదనమేదీ లేదని.. రాబోయే రోజుల్లో పేదలకు రైలు సౌకర్యం దూరం కాబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు.
పొన్నం ప్రభాకర్..
రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని.. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ స్పందించడం లేదని విమర్శించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిధుల సాధన కోసం కేంద్రం పై ఒత్తిడి పెంచడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని పొన్నం విమర్శించారు.
ఇంద్రకరణ్‌రెడ్డి..
కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సప్లమెంటరీ బడ్జెట్‌లో అయినా రాష్ట్ర ప్రాధాన్యతలు గుర్తించాలని కోరారు.
కేంద్ర మంత్రి జయంత్ సిన్హా..
రైల్వేలు భారత ఆర్థికవ్యవస్థకు వెన్నెముక అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ చక్కటి సమన్వయంతో కూడిన రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారని మంత్రి సురేశ్ ప్రభుని కొనియాడారు.