Read more!

మోడీతో ఢీ అంటే ఢీ.. తగ్గేదేలే ..రాహుల్ !

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు  పార్లమెంట్ మాజీ సభ్యుడు రాహుల్ గాంధీ  ప్రధాని నరేంద్ర మోడీపై, తగ్గేదే లే అన్న తరహాలో మరో మారు విరుచుకు పడ్డారు. ప్రశ్నాస్త్రాలను సందించారు. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ‘మోడీలంతా దొంగలే’ అనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్య.. పై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సూరత్ కోర్టులో  వేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో నాయస్థానం ఆయనకు రెండేళ్ళు జైలు శిక్ష విధించిన విషయం. కోర్టు తీర్పు నేపధ్యంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే.

అయితే రాహుల్ గాంధీ అనర్హత వేటు పడినా  తగ్గేదేలే అనే రీతిలో, అదానీ, మోడీ సంబంధాలను మరోమారు గట్టిగా గళమెత్తారు.  అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. డిఫెన్స్ సెక్టార్‌తో ముడిపడి ఉన్న అదానీ షెల్ కంపెనీలలో ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాలని ప్రధాని మోడీని ప్రశ్నించారు. అలాగే అదానీ కంపెనీ పెట్టుబడులలో  ఒక చైనా జాతీయుడికి కూడా సంబంధం  ఉందని ఆరోపించారు. అందుకే ఆ పెట్టుబడుల వివరాలేంటో చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అలాగే  దేశంలో ప్రజస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశ విదేశాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ,  తాను భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను, పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

భారత్‌ జోడో యాత్రతో  ప్రజల్లోకి వెళ్లానని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాస్వామ్యం పై విశ్వాసం లేదని,   ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తే అయితే తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఫైరయ్యారు. భారత ప్రజల ప్రజాస్వామిక గొంతు వినిపించేందుకు, కాపాడేందుకే  తాను ఉన్నానని  భయపడేది లేదని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలకు ఇదివరకటిలా మీడియా సంస్థల నుంచి లభించిన మద్ధతు ఇప్పుడు లేదు. ఇది ఓబీసీల వ్యవహారం కాదు. ఇది మోడీ, అదానీల సంబంధానికి సంబంధించిన వ్యవహారం. దాన్నుంచి దృష్టి మళ్లించడం కోసం విదేశాల్లో నా వ్యాఖ్యల గురించి మాట్లాడతారు. అనర్హత అంశాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఓబీసీ అంటున్నారు. నేను నిజం మాట్లాడతాను. మాట్లాడుతూనే ఉంటాను. నాపై అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు. అనర్హతలు లాంటివి నన్ను ఏం చేయలేవు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నా పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. మోడీని  ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇది ఓబీసీ వ్యవహారం కాదు... మోదీ, ఆదానీ మధ్య ఉన్న బంధం పై ప్రశ్నిస్తున్నాను. రూ. 20 వేల కోట్లు ఎక్కడివి, ఎక్కడి నుంచి ఆదానీ షెల్ కంపెనీల్లోకి వచ్చాయో చెప్పాలని రాహుల్ గాంధీ విలేకరుల సమవేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు.  

కేసు, శిక్ష, తదుపరి కార్యాచరణ గురించి అడిగియన ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీ, నేను దేశ న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. అందుకే న్యాయపరమైన అంశాల గురించి నేను ఇప్పుడు మాట్లాడను. . పార్లమెంటులో నేను మాట్లాడబోయే అంశాల గురించి మోదీ భయపడ్డారు. నాపై అనర్హత వేటు వేయడానికి అదే కారణం. నాకు సంఘీభావం, మద్ధతు ప్రకటించిన విపక్షాలకు కృతజ్ఞతలు. అందరం కలసి కట్టుగా పనిచేద్దాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, లేకున్నా నా పని నేను చేస్తా అని రాహుల్ ఉద్ఘాటించారు.

  ప్రధాని ప్రతిపక్షాలకు ఒక గట్టి ఆయుధాన్ని ఇచ్చారు. ప్రధాని చర్యలతో ఆయన చేసిన తప్పు గురించి చర్చ జరుగుతోంది. అదానీ ఒక అవినీతి, అక్రమార్కుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని ప్రధాని మోడీ ఎందుకు కాపాడాలని చూస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అదానీ గురించి అడిగితే.. దేశంపై దాడి అంటున్నారు. అంటే అదానీయే దేశం అని ప్రధాని చెబుతున్నారా?  అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా  విలేకరుల సమావేశంలో రాహుల్  ప్రవర్తించిన తీరును గమనిస్తే  ఆయన  మోదీ మహా సంగ్రామానికి సిద్దమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.