రాహుల్... నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించు!
posted on Sep 20, 2015 @ 4:25PM
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సవాల్ విసిరింది. కాంగ్రెస్ పార్టీ తనకు లీగల్ నోటీసులు పంపడంపై ఆగ్రహించిన స్మృతీ... దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలంటూ రాహుల్ ను ఛాలెంజ్ చేశాను. ఫ్యాక్టరీ పెడతామంటూ తీసుకున్న భూమిలో పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా, ఆ ల్యాండ్ ను ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలని ప్రజల తరపున మాట్లాడితే లీగల్ నోటీసులు పంపుతారా అంటూ ఆమె మండిపడ్డారు. లీగల్ నోటీసుల పేరుతో తన నోరు మూయించలేరన్న స్మృతీ... రాజీవ్ ట్రస్ట్ ఆధీనంలో ఉన్న భూమిని తిరిగిచ్చేయాలని సూచించారు, లేదంటే అక్కడ పరిశ్రమ అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సైకిల్ ఫ్యాక్టరీ పెడతామంటూ తీసుకున్న భూమిని, ఓ కంపెనీ రాజీవ్ ట్రస్ట్ కి అమ్మడంతో వివాదం నెలకొంది, లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఆ కంపెనీకి భూమి కేటాయించి, దాన్ని రాజీవ్ ట్రస్ట్ కొనుగోలు చేసిందని స్మృతీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ.... కేంద్ర మంత్రికి లీగల్ నోటీసులు పంపింది