టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈటల! రాహుల్ గాంధీ ఆఫర్?
posted on May 15, 2021 @ 11:56AM
కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. మాజీ మంత్రి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈటల కాంగ్రెస్‌లో చేరబోతున్నారని కొందరు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించి నెగ్గుకు రాగలమా అని ఈటల రాజేందర్ మల్లగుల్లాలు పడుతున్నారట. కేసీఆర్ ను ఢీకొట్టడం అంత ఈజీ కాదని భావిస్తున్న రాజేందర్.. ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరి కేసీఆర్ పై రివేంజ్ తీసుకోవాలని యోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే చేరితో ఏ పార్టీలో చేరాలన్నదానిపై తన సన్నిహితులతో ఈటల చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.
ఈటల రాజేందర్ తాజా అడుగులు, వరుస సమావేశాలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. బీజేపీలో చేరాలని కూడా ఈటల మీద ఒత్తిడి ఉంది. అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడం కష్టమని భావించారట. అందుకే ఆయన కాంగ్రెస్‌లో చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన టీఆర్ఎస్ బహిషృత నేత డీఎస్, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క తో వేరువేరుగా సమావేశం అయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అయ్యారు. మరోవైపు రేవంత్‌రెడ్డితో కూడా ఫోన్లో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.
ఈటల బలమైన బీసీ నేత. అంతేకాక తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా పనిచేశారు. దీంతో కేసీఆర్‌కు ఎదుర్కొనేందుకు ఈటల రాజేందర్ వంటి నాయకుడు అవసరమనే అభిప్రాయానికి హైకమాండ్ వచ్చిందంటున్నారు. అందుకే ఆయన్ను కాంగ్రెస్ లో చేరేలా ప్రయత్నాలు చేయాలని తెలంగాణ నేతలకు రాహుల్ గాంధీ సూచించారని అంటున్నారు. హైకమాండ్ ఆదేశాలతో టీపీసీసీ నేతలు కొందరు రాజేందర్ తో మాట్లారాని అంటున్నారు. ఈటల రాజేందర్ నిర్ణయం తీసుకున్న వెంటనే రాహుల్ గాంధీతో మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించడంతో అతడిపై తెలంగాణ సమాజంలో సానుభూతి నెలకొన్నది. పార్టీల కతీతంగా అందరూ ఈటలపై సింపతీ కనబరుస్తున్నారు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ యోచిస్తున్నదట. ఈటల రాజేందర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కూడా కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈటల పార్టీలో చేరిన వెంబడే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు? అన్న అనుమానులు ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మరో ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ హైకమాండ్ తలపట్టుకొని కూర్చున్నది. అందుకే ముందుగా ఈటల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి.. ఆ తర్వాత చూద్దామనే యోచనలో ఉందంటున్నారు.
ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ లోని అన్ని వర్గాలు సానుకూలంగానే ఉన్నాయని చెబుతున్నారు. టీపీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటలకు మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్లంతా ఈటలను ఆహ్వానించేవారే. ఈ పరిస్థితుల్లో ఈటలకు కాంగ్రెస్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అంటున్నారు.