నేను హిందువును.. హిందుత్వ వాదిని కాదు! రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
posted on Dec 12, 2021 @ 6:31PM
“హిందూ వేరు, హిందుత్వవాది వేరు. నేను హిందువును. హిందుత్వ వాదిని కాదు” కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, చేసిన ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసింది.కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదానికి తిలోదకాలు ఇచ్చి, సాఫ్ట్ హిదుత్వ పంథాలోకి అడుగులు వేస్తుందా, అనే సందేహం, కలుగుతోందా అన్న సందేహం ఇటు కాంగ్రెస్ ప్రతి వర్గాల్లో, అటు లౌకికవాద రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రాజస్థాన్లోని జైపుర్లో కాంగ్రెస్ పార్టీ ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ,బహిరంగ సభ నిర్వహించింది. పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా సహా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ ఇతర సీనియర్ నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు, ప్రసంగించారు. అయితే ఢిల్లీ నుంచి జైపుర్ వచ్చినా సోనియా గాంధీ మాత్రం ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెనుతిరిగారు. కార్యకర్తలు, మద్దతుదారుల వద్ద ఉన్న నల్ల రంగు రుమాలు, స్కార్ఫ్, మఫ్లర్ వంటి వాటిని లోపలకు అనుమతించలేదు. వాటిని తీసివేస్తేనే లోపలికి వెళ్లనిచ్చారు.నల్ల రంగు దుస్తులను సభకు అనుమతించకపోవటం చర్చనీయాంశంగా మారింది.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసనలు చేస్తారనే భయంతోనే అలా చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సోనియా గాంధీ, ప్రియాంకా వాద్రా సమక్షంలో రాహుల్ గాంధీ చేసిన, హిందూ, హిదుత్వవాది వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, కాంగ్రెస్సేతర లౌకికవాద పార్టీలలో కూడా చర్చకు తెర తీశాయి. ఒక విధంగా వివాదంగా మారాయి. అంతేకాదు, ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. ప్రస్తుతం దేశం రాజకీయాలు హిందువులు. హిందుత్వవాదుల మధ్య పోటీగా సాగుతున్నాయని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ తనను తాను గాంధీతో పోల్చుకున్నారు. బీజేపీని, మోడీని గాడ్సేతో పోల్చారు. భారతీయ జనతా పార్టీ లక్ష్యంగానే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందుత్వవాదులకు అధికారమే ముఖ్యమని, 2014 నుంచి వారు అధికారంలో ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అందులో సందేహం లేదు. తప్పు కూడా లేదు. అలాగే, హిందుత్వవాదులను అధికారం నుంచి దింపేసి, హిందువులను తీసుకురావాలని పిలుపు నిచ్చారు. హిందుత్వవాదులు అధికారం కోసమే తమ జీవితాంతం ఆరాటపడతారు. వారికి అధికారం కన్నా ఏదీ ఎక్కువ కాదు. దాని కోసం ఏదైనా చేస్తారు అన్నారు. ఈ దేశం హిందువులది, హిందుత్వవాదులది కాదు, అంటూ రాహుల్ గాంధీ బీజేపీ లక్ష్యంగా అస్త్రాలను సంధించారు. అయన దృష్టిలో హిందుత్వ వాదులు అంటే బీజేపీనే కాబట్టి కబాటి అది కూడా తప్పు పట్టలేము. అయితే, రాహుల గాంధీ మాటల్లో వచ్చిన మార్పు దేనికి సంకేతం? లౌకికవాదానికి కాంగ్రెస్ పార్టీ తిలోదకాలు ఇచ్చిందా? ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అడుగులో అడుగేసి నడుస్తున్నారా? సాఫ్ట్ హిదుత్వ పంథాలోకి అడుగులు వేస్తున్నారా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.