రాహుల్ జీ బర్త్ డే.. ఇంతకీ ఆయన ఎక్కడ?

కాంగ్రెస్ అధినేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  తన 55వ పుట్టిన రోజు    గురువారం( జూన్ 19) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు, ఇండియా కూటమి నాయకులు, వందల వేల మంది రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీని తమ ఆదర్శ సోదరునిగా పేర్కొంటే,  ఖర్గే  రాజ్యంగ పరిరక్షణ కోసం లక్షలాది  గొంతుకలను ఒక్కటై వినిపిస్తున్న నాయకుడిగా రాహుల్ గాంధీని అభివర్ణించారు. అలాగే.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  కె.సి. వేణుగోపాల్  కష్ట కాలంలో భారతదేశానికి అవసరమైన నాయకుడిగా రాహుల్ గాంధీని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీని   నా నాయకుడు  అని సంభోదిస్తూ..  రాహుల్  గాంధీ దేశానికి ఆశాకిరణం  అని ప్రశంసించారు.
మరో వంక..  పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పుఅర్కరించుకుని  కాంగ్రెస్ పార్టీ,  ఢిల్లీలోని  తల్కతోరా  స్టేడియం లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 20 వేల మంది నిరుద్యోగ యువత తమపేర్లను నమోదు చేసుకున్నారని  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  జాతీయ యువజన కాంగ్రెస్, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో  100 పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయనీ.. ఈ మేళా ద్వారా కనీసం 5000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కుతాయని  జాతీయ యువజన కాంగ్రెస్  అధ్యక్షుడు దేవేందర్ యాదవ్  ప్రకటించారు. 

అయితే..  బీజేపీ ఢిల్లీ నాయకులు మాత్రం ఇదొక పొలిటికల జిమ్మిక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ  దేశ రాజదాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశం నుంచి పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందనీ, అందుకే ఏదో విధంగా..  ఉన్నామని చెప్పుకునేందుకు, పార్టీ ఉనికిని కాపాడు కునేందుకు  హస్తం పార్టీ  జిమ్మిక్కులు చేస్తోందని ఆరోపించింది. ఇలాంటి జిమ్మిక్కులతో పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని అనుకుంటే పొరపాటే, అవుతుందని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సామాన్య ఢిల్లీ ఓటర్లే విశ్వసించ లేదు. వరసగా ఆరు (మూడు లోక్ సభ, మూడు అసెంబ్లీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సున్నా సీట్లతో సత్కరించిన విషయాన్ని మరిచిపోరాదని బీజేపీ నాయకులు  గుర్తుచేస్తున్నారు.  

మరోవంక సోషల్ మీడియాలో ఓ వంక రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంటే,  మరో వంక  రాహుల్ ఎక్కడ? ఏ దేశంలో ఉన్నారు? జార్జి సోరోస్ కుమారుడి వివాహానికి వెళ్ళింది నిజమేనా? అంటూ అంటూ నెటిజనులు  ప్రశ్నిస్తున్నారు. మరి మీ పెళ్లి ఎప్పుడని  సైటర్లు వేస్తున్నారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనల  విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవం రోజున, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో..  ఇలా అనేక  కీలక  సందర్భాల్లో  రాహుల్ గాంధీ తరచూ జరిపే రహస్య  విదేశీ పర్యటనలపైన నెటిజన్లు.. ఎవరికీ తోచిన విధంగా వారు రియాక్ట్ అవుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు. 

చంద్రబాబు కోసం బండ్ల గణేష్ పాదయాత్ర

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. సంకల్ప యాత్రు పేరిట తాను చేపట్టిన ఈ యాత్ర ఎంత మాత్రం రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేసిన బండ్ల గణేష్ కేవలం తన మొక్కు చెల్లించుకోవడం కోసం మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నానన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన సినిమా థియేటర్ నుంచి సోమవారం (జనవరి 19)   ఉదయం ఆయనీ యాత్రను ప్రారంభించారు. దాదాపు  500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమ లకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో నేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.  జగన్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేయడం తనను ఎంతో బాధించిందన్న బండ్ల గణేష్ అప్పట్లో ఆయనకు బెయిలు వస్తుందని కోర్టు విచారణ ఉన్న ప్రతిసారీ సుప్రీంకోర్టులో ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఈ కేసు నుంచి ఆయన  ఎలాంటి మచ్చలేకుండా విడుదల కావాలని ఏడుకొండల వాడికి మొక్కుకున్నానన్నారు. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికే షాద్ నగర్ లోని తన సినిమా థియేటర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించానని బండ్ల గణేష్ చెప్పారు. 

ఏపీ లిక్కర్ స్కామ్‌.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడి నోటీసులు

ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.  ఇప్పటికే  ఈ కేసులోపలువురు కీలక వ్యక్తులను విచారించిన ఈడి, రెండు రోజుల కిందట వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా  వైసీపీకి చెందిన మరో ఎంపీకి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   మిధున్ రెడ్డిని ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో  పేర్కొంది.   ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.  ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని   ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును వివిధ మార్గాల్లో  మనీ ల్యాండరింగ్ చేశారనీ, ఆ సొమ్ము  కీలక వ్యక్తుల వరకూ చేరిందని ఈడీ అనుమానిస్తోంది.   జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో  లైసెన్సుల కేటాయింపు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే  దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలకంగా భావి స్తున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టత కోసం ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి పలువురు అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులను విచారించిన ఈడి, తాజాగా ఎంపీ స్థాయి నేతకు నోటీసులు ఇవ్వడంతో కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకున్నదని భావించవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి విచారణ లో కొత్త ఆధారాలు వెలుగు లోకి వచ్చే అవకాశ ముందం టున్నారు.   మనీ ట్రయిల్‌పై ఈడి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు  ఈ పరిణా మాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతు న్నాయి.  మిథున్ రెడ్డి ఈడి విచారణకు ఎలా స్పందిస్తారన్నది, విచార ణలో ఏమి బయటపడ నున్నదని, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మిథున్ రెడ్డి కాషాయ తీర్థం.. జాప్యానికి కారణమేంటంటే?

వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ర రెడ్డి కమలం గూటికి చేరుతాడంటూ గత ఐదారు నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి బయటకు వచ్చిన మిథున్ రెడ్డి ఇక బీజేపీ తీర్థం పుచ్చుకోవడమ లాంఛనమేననీ, అయితే మిథున్ రెడ్డి కంటే ముందు మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజ‌య‌సాయిరెడ్డి  కూడా కమలం కండువా కప్పుకుంటారనీ గట్టిగా వినిపించింది. అయితే ఆ ప్రచారం ఇప్పటికీ ప్రచారంగానే మిగిలిపోయింది. ఇంతలో  విజ‌య‌సాయిరెడ్డి సొంతంగా  కొత్త  పార్టీ  పెడ‌తార‌ంటూ ప్రచారం మొదలైంది. ఆ మాట స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పారు.  అది పక్కన పెడితే  మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ల‌డానికి ఆటంక‌మేంటి? అన్న చర్చ ఆరంభమైంది.   మిథున్ రెడ్డి  తండ్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి  వైసీపీలో అత్యంత కీలకమైన నేత. మిథున్ రెడ్డికి 2014- 24 మ‌ధ్య 500 శాతానికిపైగా ఆస్తుల పెరుగుద‌ల ఏమంత సులువుగా  జ‌ర‌గ‌లేదు. జ‌గ‌న్ కి అత్యంత స‌న్నిహితుడు మిథున్ రెడ్డి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో జ‌గ‌న్ హయాంలో ఆయన కేబినెట్ లో పెద్దిరెడ్డి చాలా ముఖ్యుడు.  భారీ ఎత్తున‌ భూక‌బ్జాలు, అట‌వీ  భూముల ఆక్ర‌మ‌ణ‌లు, ఆపై ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ వంటి కార్య‌క‌లాపాలు య‌ధేచ్చ‌గా సాగాయనీ, తండ్రీ కొడుకులు పెద్దరెడ్డి, మిథున్ రెడ్డిలు కోట్లాది రూపాయ‌లు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్న మరక ఉన్నందున మిథున్ రెడ్డి ఎంట్రీ విషయంలో బీజేపీ ముందువెనుకలాడుతోందని పరిశీలకులు అంటున్నారు. అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు. ఇంతకీ బీజేపీ పెట్టిన కండీషన్స్ ఏమిటంటే.. మిథున్ రెడ్డి బీజేపీ గూటికి చేరిన తరువాత ఇక జగన్ తో ఎటువంటి సంబధాలూ ఉండకూడదు.  లోపాయికారీ ఒప్పందాలేవీ చేసుకోకూడ‌దు. ఈ కండీషన్స్ కారణంగానే   మిథున్ రెడ్డి బీజేపీలో చేరికకు బ్రేక్ పడిందని అంటున్నారు. అంతే కాకుండా కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులను కూడా తీసుకురావాలని బీజేపీ షరతు విధించిందనీ, అది కూడా మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీ జాప్యం కావడానికి కారణమంటున్నారు.   ఇప్ప‌టికే వైసీపీలో కొంద‌రు సీనియ‌ర్లు.. సైలెంట్ మోడ్ లోకి వెళ్లి  పోయారు. అలాంటి వారితో క‌ల‌సి మిథున్ బీజేపీలోకి వ‌స్తే.. ఏపీలో కూడా పార్టీ బ‌ల‌ప‌డుతుంది. కాబ‌ట్టి.. అలా చేయ‌గ‌లిగితే త‌మ‌కేం అభ్యంత‌రం లేద‌ని కేంద్ర క‌మ‌ల‌నాయ‌క‌త్వం భావిస్తోంద‌ట‌. దీంతో ఇటు మిథున్ తో పాటు అటు విజ‌య‌సాయి  కూడా ఇలాంటి క‌మ‌లం బాట ప‌ట్టే వారి  కోసం తీవ్రంగా  య‌త్నిస్తున్నార‌ట‌. దీంతో మిథున్ బీజేపీ ఎంట్రీకి జాప్యం అవుతోందనీ, బీజేపీ కండీషన్లన్నిటినీ నెరవేర్చి  మిథున్ రెడ్డి బీజేపీకి వెళ్లేలోపు   2029 ఎన్నిక‌లు కూడా వ‌చ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.

మళ్లీ జగన్ కోటరీని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ చుట్టూ కోటరీ ఉందని వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి..  తాజాగా అమ్ముడుపోయి కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండని హితవు పలికారు. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించాలని పేర్కొన్నారు. వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. దానికి కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవటమే కదా అని ట్వీట్ చేశారు. అయితే, గతంలోనూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ కోటరీ ఉందని.. విజయసాయిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్‌ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

జీవితంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయను : జగ్గారెడ్డి

  కాంగ్రెస్ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల్లో మర్చిపోలేనిదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఇళ్ళ స్థలం లేని పేదలతో సంగారెడ్డిలోని గంజి మైదానంలో టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే, నన్ను  ఇక్కడ ఓడించారు. జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్‌ గాంధీ అడిగితే.. నన్ను ఓడించారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిది.  అందుకే సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాని  హాట్‌ కామెంట్స్‌ చేశారు. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు..ఇక్కడి మేధావులు.. పెద్దలది. రేపు సంగారెడ్డిలో నా సతీమణి నిర్మలా పోటీ చేసిన కూడా నేను ప్రచారం చేయను. రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయను’ అని జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు  

శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం.. ఆ విషయం ఆయనకు తెలుసా అరవిందా?

(శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం ఉంది.. ధర్మపురి అరవింద్) మొన్నామధ్య  వూరి పెద్ద బస్టాండ్‌లో మిట్టమధ్యాన్నం కాషాయ దుస్తుల్లో ఒకాయన బస్సుదిగాడు. మెల్లగా చెట్టు నీడలోకి వచ్చి సోడా తాగి బెంచీ మీద కూచున్నాడు. అప్పటిదాకా కాగితంతో ఆడుతున్న కుక్కపిల్లతో సహా అక్కడ బెంచీల మీద కూచున్నాళ్లంతా ఆయన్నే చూస్తుండిపోయారు. ఓ అరగంట తర్వాత బస్సు క్లీనర్‌ దగ్గరగా వెళ్లి పలకరించాడు..‘సామీ ఎవరు మీరు? ఇక్కడ ఎవరు కావాల?’ అని. చిన్న గడ్డం సవరించుకుంటూ ‘నర్సిమ్మ కొట్టుకెల్లి   బీడీకట్టట్టుకురారా అంటూ ఆ స్వామి ఆదేశించాడు. అంతే ఆయన మాటతీరు  బాగా దగ్గరగా చూసిన ఆ కుర్రాడు.. ఒరేయ్‌  ఈడు సాములోరు గాదురా.. మన  సత్తిగాడు అని గావుకేక వేశాడు. ఏదో వజ్రాన్ని కనుగొన్నట్టు బస్టాండ్‌ అంతా పరిగెడుతూ అందరికీ స్వామి అసలు పేరుతో సహా ప్రకటించాడు. అంతే వీలయినంతమంది సత్తి చుట్టూ చేరి  అయినా ఇదేం యాశంరా ’ అంటూ ప్రేమగానే తిట్టారు.  సదరు స్వామి నవ్వి,  వేషం మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. వీధిపేరు, ఊళ్లో బావిపేరు, మున్సిపల్‌ స్కూలు పేరు.. ఇలా అన్నీ  మార్చేస్తున్నారు. నన్నూ మారుస్తారని  ముందుగా నేనే మారిపోయాను. ఎవరో మనల్ని మార్చడం కన్నా మనకు మనము మారడం ఉత్తమం కదా  అన్నాడు స్వామి సత్తి.అందరూ తలగోక్కున్నారు. వీడిలానే వీడి మాటా అర్దమై చావదు, ఏం చెబుతున్నావో సరింగజెప్పరా పిచ్చి సన్నాసీ  అని అరిచింది అరటిపళ్లు అమ్మే ముసలామె. గొంతు సవరించుకుని సత్తి సామి..  అంతా రామమయం  అంటే కేవలం సినిమాలో ఎస్పీ గొంతు చించుకున్న పాటే అనుకున్నామా, కానీ  అది అంతటితో ఆగలేదు, అంతా రామమయం అంటే అంతటా, అన్నింటా రామమయం చేయాలని కొందరు కాషాయాలు బిగించారు. మీకింకా ఆ సంగతి తెలియలేదు. తెలిసేప్పటికీ మీ ఇళ్ల పేర్లన్నీ రాముడితో, కృష్ణుడితో నిండిపోతాయి నాయనలారా  అంటూ జ్ణానబోధ చేశాడు స్వామి సత్తి.  అదెట్టా? అడిగారు కొందరు. దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఆ మాతను మనసులో నిలుపుకుని అంతే పద్దతిలో మనం నడచుకోవాలి అని  ఏలికలు నువ్వూ నేనూ చూడని పాతతరం సీనియర్‌ నాయకుల స్ఫూర్తితో, భక్తి రసం తలకెక్కించుకుని రైల్లో, విమానాల్లో బయలుదేరి వీలయినన్ని ప్రాంతాలు, భవనాలు, కూడళ్లు, గ్రామాల పేర్లు అమాంతం మార్చేస్తున్నారు. అదో దండు. లోకంలో వారిని మించిన రామభక్తులు ఉండటం అసాధ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీ యింట్లో పెద్దతరం వారూ వీళ్ల ముందు బలాదూర్‌. బతికిబట్టకట్టమంటూ ఇచ్చే కార్డు ముక్క కూడా స్వయంగా రాములవారి భిక్షట. ఏలిక స్వయంగా రామభక్తుడు. అందువల్ల ప్రజలంతా చచ్చినట్టు రామసంకీర్తనతోనే కార్యాలయాల్లో, బడిలో కాలం గడపాలేగాని వేరే లోకం ఉండకూడదు.  అలాగాకుంటే ఆంజనేయులవారికి చెడ్డ కోపం వస్తుందని, కండల మీద బొమ్మలు వేసుకున్న వస్తాదులు ఊరూరా తిరుగుతున్నారు.ఈ భక్తి పారవశ్యంలో వీలయినన్ని ఊళ్లు, బజార్లు, బస్టాండ్ల పేర్లు మారుస్తూ పోతున్నారు. అలవాటులో పొరపాటుగా నా పేరూ మార్చేస్తారేమోనని ముందు జాగ్రత్తకోసం కాషాయం ధరించా.  ఇంతలో ఎవరో సైకిల్‌ మీద పోతూ ‘జై శ్రీరామ్‌!’ అని అరుస్తూ వెళ్లాడు.   కొంత దూరం వెళ్లి ఆగి మళ్లీ  వెనక్కి వచ్చి అటుగా సిగెరెట్టు తాగుతూ వెళుతోన్న కుర్రాడిని అడ్డగించాడు. నీకు దేశభక్తి లేకపోతే ఎలాగయ్యా.. ఏలిక దేశ ప్రగతి కోసం  సంస్కృతిని కాపాడేందుకు ఎంత చమటోడుస్తున్నాడు.. జైశ్రీరామ్‌ అను ఆయనకు ఉపశమనం కలుగుతుంది అన్నాడు.  ఛస్తే అన్ను.. ఆయనకు దురదేస్తే.. నేను గోక్కోడం ఏమిటయ్యా బుద్ధుందా?’ అని ఎదురు తిరిగాడు.. అంతే ఓ అరగంట అలా గొంతు చించుకున్నారు. ఆనక అలసిపోయి విడిపోయారు.  రాములవారికీ పార్టీ సభ్యత్వం అంటగట్టినవారు దేశాన్ని ఒకే రంగు పులిమి ఓట్లు గుద్దించుకోవడమనే వారి భవిష్యత్‌ ప్రణాళిక. డబ్బు చేసినవాడికి జబ్బో లెక్కా.. రాముడిని ఎలాగయినా వాడుకోవచ్చని నిర్ధారించుకున్నాక కౌసల్య రూపంలో ఎవరు గుండెలు బాదుకున్నా ఏమీ కాదు..!

కార్పొరేషన్ మేయర్లు, మునిసిపల్ చైర్మన్ ల రిజర్వేషన్లు ఖరారు

కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను తెలంగాణ  ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి శనివారం (జనవరి 17) ఉత్తర్వులు జారీ చేశారు.  ఇక  కార్పొరేషన్‌ చైర్మన్లకు ఖరారు చేసిన రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌  ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్‌కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ మహిళ జనరల్,  గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో మహిళ జనరల్‌ను ఖరారు చేశారు.

ఏపీ మద్యం స్కాం.. విజయసాయికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  2019 నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు, అక్రమాలు, మనీలాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది.   మద్యం సేకరణ వ్యవస్థను ఆటోమేటెడ్ ప్రక్రియ నుండి మాన్యువల్ ఆమోదాలకు మార్చడం, తద్వారా కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాల మార్పిడికి దోహదపడిందని ఈడీ తన దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.   కాగా ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేసింది వారిలో కొందరు బెయిలుపై విడుదల కాగా, ఇంకా కొందరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, వైసీపీకీ రాజీనామే చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాననీ, వ్యవసాయమే తన వ్యాపకమని చెప్పుకుంటున్న విజయసాయి ఈడీ విచారణలో ఏం చెబుతారన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పలు సందర్భాలలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఈడీ విచారణలో  వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయంటున్నారు.  

పాపం దానం.. కింకర్తవ్యం

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది.  మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు ఉండగా, వారిపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలపై తన నిర్ణయాన్ని వెలువరించారు. ఆ ఏడుగురూ పార్టీ ఫిరాయించారనడానికి ఎటువంటి ఆధారాలూ లేవనీ, వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారనీ స్పష్టమైనే తీర్పు ఇచ్చారు.   ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,  స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ చెప్పడానికి ఇసుమంతైనా అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందున్న మార్గమేంటని పరిశీలిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా, తన రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగడం. ఇది ఒక్కటే దానం నాగేందర్ ను అనర్హత వేటు నుంచి బయటపడేయగదని పరిశీలకులు అంటున్నారు. అలా కాకుండా ఎమ్మెల్యేగా కొనసాగి అనర్హత వేటుకు గురైతే తదుపరి ఎన్నికలలో పోటీకి కూడా ఆయన అనర్హుడయ్యే అవకాశం ఉందంటున్నారు.   బహిరంగంగా వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారలేదు అని స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు.   

రాహుల్ నోట మళ్లీ ఓటు చోరీ మాట!

కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నోట మళ్లీ ఓటు చోరీ మాట వచ్చింది. మహా మునిసిపల్ ఎన్నికలలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన రాహుల్ గాంధీ, ఎన్నికలలో ఓటు వేసే సమయంలో ఓటర్ల వేలికి వేసే సిరాకు బదులు మార్కర్ పెన్నులు ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో  ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు. కాగా ఓటర్ల వేలికి సిరాకు బదులు మార్కర్ పెన్ను ఉపయోగించడంపై కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఎన్డీయే కూటమి యేతర పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మహా మునిసిపోల్స్ లో మరీ ముఖ్యంగా బృహాన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు.