రాహుల్ గాంధీ పాదయాత్రతో ఏపీలో కాంగ్రెస్ కోలుకొంటుందా?
posted on Jul 24, 2015 @ 11:16AM
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది సేపటి క్రితమే అనంతపురం జిల్లాలో ఓబులదేవర చెరువు నుండి పాదయాత్ర ప్రారంభించారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శించడానికే ఆయన పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. కానీ రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని తిరిగి బలోపేతం చేసేందుకే ఆయన పాదయాత్ర చేస్తున్నారని అందరికీ తెలుసు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన పాదయత్రని ఎన్నికల ప్రచారసభలాగా చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు సోనియా గాంధీ కూడా అదే జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించినపుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధించింది కనుకనే రాహుల్ గాంధీ కూడా తన పర్యటనకు అనంతపురం జిల్లాని ఎంచుకొన్నారు తప్ప అక్కడి రైతులను ఓదార్చడానికని ఎవరూ భ్రమపడనవసరం లేదని తెదేపా నేతలు వాదిస్తున్నారు. కానీ రాష్ట్ర విభజనకు మూలకారకుడయిన రాహుల్ గాంధీ చేసే ఈ పాదయాత్రతో రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చేసుకొంటారనే భ్రమ కూడా అనవసరమేనని చెప్పక తప్పదు.
ఎందుకంటే ఆయన చేస్తున్న ఈ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగకపోగా ఇప్పుడిప్పుడే మానుతున్న గాయాన్ని మళ్ళీ కెలికినట్లవుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో...ఎన్ని ఆర్ధిక సమస్యలు..పొరుగు రాష్ట్రంతో వివాదాలు, యుద్దాలు చేయవలసివస్తోందో, ఆ కారణంగా ప్రజలు, ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఈ సమస్యలన్నిటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేయడమేనని ప్రతీ ఒక్కరికీ తెలుసు. అందుకు కారకుడయిన రాహుల్ గాంధీ ఈ రోజు రాష్ట్రంలో పాదయాత్ర చేయడాన్నే ప్రజలు నిరసిస్తుంటే, ఆయన ఈరోజు తన పాదయాత్ర ముగింపు సమయంలో కొండకమర్ల గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో రాష్ట్ర విభజన గురించి మాట్లాడబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన వలన రాష్ట్రానికి ఎటువంటి నష్టమూ జరగలేదని పైగా అంతా మంచే జరిగిందని ఆయన ఈ సభలో ప్రజలకి నచ్చచెప్పబోతున్నట్లు సమాచారం.
అదే నిజమయితే రాష్ట్రంలో జీవచ్చవంలా మిగిలున్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీయే స్వయంగా భూస్థాపితం చేసిపోయేందుకే ఆయన వచ్చారని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి, పల్లె, పరిటాల, ఎమ్మెల్సీ ముద్దు కృష్ణంనాయుడు చేస్తున్న వాదనలు నిజమని నమ్మక తప్పదు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు సిద్దపడగానే చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజకీయ సన్యాసం తీసుకొన్నారు. మరికొందరు ఎన్నికలకు ముందు, తరువాత ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు త్వరలో వేరే పార్టీలలోకి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారు. ఉదాహారణకి కొన్ని రోజుల క్రితమే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైకాపాలోకి వెళ్ళబోతూ ఆఖరి నిమిషంలో ఆగిపోయారు. అటువంటివారు కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మందే ఉన్నారు. బహుశః రాహుల్ గాంధీ పాదయాత్ర ఎఫెక్ట్ తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసేసి వేరే పార్టీలోకి వెళ్లిపోవచ్చునని తెదేపా నేతలు అభిప్రాయ పడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని తెలిసినప్పటికీ, త్వరలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టబోతున్న రాహుల్ గాంధీ తక్షణమే చొరవచూపి పార్టీలో మిగిలిన నేతలయినా విడిచిపెట్టిపోకుండా కాపాడుకొనేందుకు, పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేయకుండా అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇటువంటి పాదయాత్రలు చేస్తుండటం ఆ పార్టీ దురదృష్టమేనని చెప్పక తప్పదు.