వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. కేటీఆర్ కు ముళ్ల కిరీటమేనా?
కమ్యూనిస్టులకు ప్రధాన కార్యదర్శి అనే పదవి ఎంత పవర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అంటే అంత వేల్యుబుల్. అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ తర్వాత అంతటి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి నుంచి ఇప్పటి వరకూ గ్రేటర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు. దుబ్బాక నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి జూబ్లీహిల్స్ బై పోల్ వరకూ ప్రతి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది. ఇటీవలి స్థానిక ఎన్నికలలోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.
రేవంత్ విమర్శలను పక్కన పెడితే.. కేటీఆర్ కి కానీ, బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేటీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేసీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.
అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?