భారత స్వాతంత్ర్య పోరాటానికి ఉగ్గు పోసింది ఈ ఉద్యమమే!
posted on Aug 8, 2023 @ 9:30AM
భారతదేశం ఈరోజు ఎంత స్వేచ్చగా ఉందో మాటల్లో వర్ణించలేనిది. బ్రిటీష్ పాలకుల చేతుల్లో నలిగిన భారతదేశం ఎలా ఉండేదో ఆ కాలంలో జీవించి, ఆనాటి పరిస్థితులు అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తాయి. నాటి పౌరులు తమ పరిస్థితులకు అక్షరరూపం ఇచ్చినా, నాటి పరిస్థితులకు దృశ్యరూపం ఇస్తూ సినిమాలు, డాక్యుమెంటరీలు రూపొందించినా అదంతా ఖచ్చితంగా నాటి భారతం అనుభవించిన క్షోభ కంటే తక్కువే. తెల్లదొరల పాలన నుండి భారతదేశానికి విముక్తి తీసుకురావడంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఈ భారతదేశ పోరాటాల్లో ప్రథమంగా చెప్పుకోగలిగింది క్విట్ ఇండియా ఉద్యమం. భారత స్వాతంత్య్రమే ధ్యేయంగా సాగిన ఈ ఉద్యమం 81ఏళ్ళ కిందట ఇదే నెలలో, ఇదే తేదీన ఊపిరిపోసుకుంది. అంటే క్విట్ ఇండియా ఉద్యమం పురుడుపోసుకుని ఈ ఏడాది ఆగష్టు 8వ తేదీకి 81ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ ఉద్యమ విశేషాలు, ఈ ఉద్యమం సాగిన తీరు తదితర వివరాలు తెలుసుకుంటే..
1942సంవత్సరం, ఆగష్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమానికి అప్పటి బొంబాయిలోని ఆగస్టు క్రాంతి మైదానం కేంద్రకమైంది(ఇదే ఇప్పటి ముంబై). భారత జాతీయ కాంగ్రేస్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభించబడింది. ఈ ఉద్యమాన్ని క్విట్ ఇండియా ఉద్యమం అనే కాకుండా ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. ఈ ఉద్యమంలోనే జాతిపిత గాంధీజీ "డూ ఆర్ డై" నినాదాన్ని ఇచ్చారు. 'సాధించు లేదా మరణించు' అనే ఈ నినాదంతో గాంధీజీ మార్గనిర్దేశకత్వంలో శాలనోల్లంఘన యాత్ర సాగింది. భారతీయుల నిరసనను అడ్డుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆపరేషన్ జీరో అవర్ ప్రారంభించింది. ఎంతో మంది కాంగ్రేస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రేస్ కార్యాలయాలపై దాడులు చేయించింది. నివేదికల ప్రకారం దాదాపు లక్షమంది అరెస్ట్ చేయబడ్డారు. వీరందరూ చాలాకాలం పాటు ఖైదు చేయబడ్డారు. సుమారు 1000మంది మరణించారు. ఈ ఉద్యమంలో 2500మందికి పైగా గాయపడ్డారు. ఉద్యమంలో కీలక సభ్యులైన గాంధీజీ, జవహార్ లాల్ నెహ్రూలను కూడా జైలులో పెట్టారు. ఇలా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. అయితే దీని తరువాత స్వాతంత్ర్యపోరాట ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమం చాలా కీలక పాత్ర పోషించింది. బ్రిటీషువారికి భారతదేశం మీద ఉన్న పట్టును బలహీనపరచడంలోనూ, వలసవాదవిదానాల పైన తీసుకోవలసిన నిర్ణయాలను, చేసుకోవలసిన మార్పుచేర్పుల అవసరాన్ని ఇది తేలతెల్లం చేసింది.
1945లో రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత రాజకీయంగా డీకోలనైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో భారతదేశ యోధుల పోరాటం మరింత ఊపందుకుంది.క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లే మార్పులు తక్షణమే తీసుకురాలేదు. అయినప్పటికీ, ఇది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ ఉద్యమం స్వాతంత్య్రానికి అనుకూలంగా భారతీయ ప్రజాభిప్రాయాన్ని పెంచడానికి దోహదపడింది. భారతీయ ప్రజలు తమ స్వేచ్ఛను సాధించడానికి నిశ్చయించుకున్నారని బ్రిటీష్ వారికి బలంగా నొక్కి వక్కాణించింది. ఈ ఉద్యమంలోనే భారతదేశ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించే కొత్త తరం నాయకులు ఆవిర్భవించారు. జాతీయ ఐక్యతా భావాన్ని కూడా ఈ ఉద్యమం ద్వారా పెంపొందించగలిగారు.
మహిళలు కూడా..
క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందరో మహిళలు కీలక పాత్ర పోషించారు. అపారమైన ధైర్యాన్ని, నాయకత్వాన్ని ప్రదర్శించారు. అహింసా యుద్దమనే కారణం ఈ ఉద్యమంలో ఎంతో మంది మహిళలు చురుకుగా పాల్గొనడానేలా చేసింది. సరోజినీ నాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ లాంటి మహా వీర వనితల స్పూర్తితో, వారి నాయకత్వం కింద ఎందరో మహిళలు ఈ ఉద్యమంలో అపర చంఢికలై కదం తొక్కారు. ఈ ఉద్యమలోనే విద్య, సంస్కృతి ప్రాధాన్యతను దేశం యావత్తు గుర్తించింది. ఈ కాలంలో దేశంలో ఎన్నో చోట్ల విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు స్థాపించబడ్డాయి.
ఇలా క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఊపందుకోవడానికి గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేసింది. అలాగే విద్య,సంస్కృతి ప్రాధాన్యతను గుర్తించేలా చేసింది. మొత్తం దేశ పౌరులను ఏకం చేసింది.
*నిశ్శబ్ద.