కేసీఆర్, కేటీఆర్ కు మంత్రి దిమ్మతిరిగే షాక్.. రేవంత్ రెడ్డి, ఈటెల ఎఫెక్ట్ పని చేస్తోందా?
posted on Oct 18, 2021 @ 2:05PM
సీఎం కేసీఆర్‌ను ముక్కోపి అంటారు. ఆయనకు ముక్కు మీదే కోపం ఉంటుందట. ప్రతీ చిన్న దానికీ కోపం నశాలానికి ఎక్కుతుందట. అందుకే ఆయనతో మాట్లాడాలంటేనే భయపడిపోతుంటారు నేతలు. ఆఖరికి కేటీఆర్ సైతం తండ్రి అంటే వణికిపోతారట. కవిత ఒక్కరికే కాస్త చనువు ఉంటుందట. ఇంట్లో వాళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంటుంది. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చిందంటే చాలు ఎవరికైనా ముచ్చెమటలు పట్టాల్సిందే అంటారు.
ఆయన ఏం అడుగుతారో తెలీదు.. ఎందుకు అడుగుతారో తెలీదు.. ఒకవేళ తెలీదని చెబితే అస్సలు ఊరుకోరు.. కోపంతో ఊగిపోతారట.. సీఎం ఛాంబర్‌లోకి వెళితే ఆయన చెప్పింది విని, తల ఊపి రావడమే కానీ,ఎదురు మాట్లాడటానికి ఉండదట. పొరబాటునా ఎవరైనా ఆయన మాటల మధ్యలో జోక్యం చేసుకుంటే.. ఇక అంతే సంగతులని అంటుంటారు. అలాంటి కోపిస్టి కేసీఆర్‌కు ఎదురు సమాధానం చెప్పడమంటే మాటలా? ఆయన ప్రశ్నకు తిరిగి కౌంటర్ వేయడమంటే మామూలు విషయమా? కానీ, ఓ మంత్రి వేసేశారు.. నేరుగా కేసీఆర్ సమక్షంలోనే రివర్స్ కౌంటర్ ఇచ్చేశారు.
వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సభ కోసం జనాలను తరలించేందుకు ఊరికో ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే, రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు అసలు ఎన్నిన్నాయంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ని కేసీఆర్ ప్రశ్నించారు. సీఎం సడెన్‌గా అడిగే సరికి బస్సుల సంఖ్య చెప్పలేక మంత్రి అజయ్ తికమక అయ్యారట. ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారట. అయితే, మధ్యలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని.. బస్సుల లెక్క కూడా చెప్పలేవా అంటూ మంత్రి పువ్వాడను ఉద్దేశించి చీప్‌గా మాట్లాడారట. పువ్వాడకు చిర్రెత్తుకొచ్చి.. తాను ఆర్టీసీ మంత్రిని కాదని, తాను రవాణా శాఖ మంత్రిని అంటూ సీఎం కేసీఆర్ సమక్షంలోనే కేటీఆర్‌కు కౌంటర్ వేశారట. ఆర్టీసీ నిర్వహణ బాధ్యత ఆర్టీసీ చైర్మన్ చూసుకోవాలని.. తాను కాదనే అర్థం వచ్చేలా ముఖం మీదే చెప్పేశారని తెలుస్తోంది.
కేసీఆర్ పువ్వాడను ప్రశ్నిస్తే.. మధ్యలో కేటీఆర్ సెటైర్ వేయడం.. మంత్రి పువ్వాడ ఖతర్నాక్ కౌంటర్ ఇవ్వడం.. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ పరిణామం బయటకి రావడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సీఎం సమక్షంలోనే మంత్రి ఇలా తండ్రీకొడుకులకు ధీటుగా జవాబివ్వడం సంచలనంగా మారింది. అక్కడ మంత్రి పువ్వాడ కేటీఆర్‌ను ఉద్దేశించే అన్నా.. ప్రశ్నించింది కేసీఆర్ కాబట్టి పరోక్షంగా సీఎంకూ కౌంటర్ పడినట్టే అంటున్నారు. పార్టీలో అయినా.. ప్రభుత్వంలో అయినా.. కేసీఆర్-కేటీఆర్ చెప్పిందే వేదం. తిరిగి మాట్లాడే ప్రజాస్వామ్య కల్చర్ అస్సలు కనిపించదు. అలాంటిది కీలకమైన సభ విషయంలో.. మంత్రి పువ్వాడ అజయ్ ఇలా ఖరాఖండిగా జవాబివ్వడం వారి అధికారాన్ని ధిక్కరించడమేనంటున్నారు.
ముఖ్యమంత్రి పరపతి, పార్టీ ప్రాభవం తగ్గిపోతుంటే.. రేవంత్‌రెడ్డి లాంటి బలమైన లీడర్ ఎమర్జ్ అవుతుంటే.. పరిస్థితి ఇలానే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. బాంచెన్ దొర అంటూ చేతులు కట్టుకొని, నోరు మూసుకొని, తలూపే రోజులు ఎప్పటికీ ఉండవని చెబుతున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్‌తో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య భావాజాలం పెరిగిందని.. నేతలకు ఈటల ఆత్మాభిమానం గుర్తు చేశారని.. అందుకే బానిస భవన్‌గా మారిన ప్రగతిభవన్‌లో ప్రశ్నించే నైజం కనబడుతోందని అంటున్నారు. ప్రశ్నిస్తే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అనే ధోరణి నేతల్లో వ్యక్తమవుతోందని విశ్లేషిస్తున్నారు.