PM dedicates this Diwali to soldiers

Prime Minister Narendra Modi in his address to the nation on the radio with the 25th edition of his monthly radio programme "Mann Ki Baat" dedicated this Diwali to the Indian Army. Talking about it he said, "Our jawans have been sacrificing their lives from last few months.

We should celebrate this Diwali in their name. People from all walks of life sent messages of love and encouragement for our jawans, just as they light candles for their well being. I also have to thank the citizens of the nation for their support and love for our security forces and soldiers protecting us. #Sandesh2Soldiers hashtag was used so much by everyone and we were flooded with well wishes & love for jawans from citizens.

They are standing for us in the desert, on the mountains, someone is guarding our industry, others our at airports. This Diwali is dedicated to the armed forces. There is not a single child in the country who doesn't have respect and love for soldiers".

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. కేటీఆర్ కు ముళ్ల కిరీటమేనా?

క‌మ్యూనిస్టుల‌కు  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి ఎంత  ప‌వ‌ర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అంటే అంత వేల్యుబుల్.  అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి  నుంచి ఇప్ప‌టి  వ‌ర‌కూ   గ్రేట‌ర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత  రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు.  దుబ్బాక నుంచి మొద‌లు పెడితే నిన్న మొన్న‌టి  జూబ్లీహిల్స్ బై పోల్ వ‌ర‌కూ ప్ర‌తి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది.  ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల‌లోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.   రేవంత్  విమర్శలను పక్కన పెడితే..  కేటీఆర్ కి కానీ,  బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేసీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.  అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  కేటీఆర్  పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  గా  ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?

సీఎం లోకేష్.. ముహూర్తం ఫిక్సైందా?

లోకేష్ ని 2027 ఉగాది నాటిక‌ల్లా  ముఖ్య‌మంత్రిని చేసే దిశ‌గా  కొన్ని  పావులు క‌దులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి మోడీ క‌లిసిన‌పుడు జ‌రిగే  ప్ర‌ధాన  చ‌ర్చ ఇదేనంటారు చాలా మంది. ఇటు ఢిల్లీ, అటు నాగ్ పూర్ వ‌ర్గాల స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఇదే జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతోంది.  ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  నంబర్ 1, 2,  3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది.  అయితే ఈ హైరాక్కీని దాటి   త్వ‌ర‌లో  లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. లోకేష్ కు సీఎం పదవి విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి అగ్రనాయకత్వం సుముఖంగా ఉందంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదంటున్నారు పరిశీలకులు. సీఎం పదవి కోసం పవన్ తొందరపడటం లేదనీ, ఆయన తన పాతికేళ్ల పొలిటికల్ కేరీర్ లు ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.   అన్నిటికీ మించి లోకేష్ కు సీఎం పట్టాభిషేకం చేయడానికి నంబర్స్ కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు మించిన సంఖ్యా బలం ఉంది. ఇక కూటమి ఐక్యత విషయానికి వస్తే.. పవన్ కు కూటమి అవసరమా? కూటమికి పవన్ అవసరమా? అన్న ప్రశ్నే తలెత్తే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కూటమి పటిష్ఠత గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతిలో లోకేష్ క్రెడిట్ ను గుర్తించడానికే మొగ్గు చూపుతున్నారు.  ఈ నేపథ్యంలోనే   సీఎం చైర్ కు లోకేష్ లైన్ క్లియ‌ర్ అయ్యిందనే అంటున్నారు పరిశీలకులు. 

ఓట్ చోరీ.. రాహుల్ ని గట్టెక్కించలేదెందుకు?

ఒక‌ప్పుడు ఇందిరాగాంధీ, ఆ తరువాత  రాజీవ్ గాంధీ.. భార‌త రాజ‌కీయాల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించారు. వారికి చట్టసభల్లో సంఖ్యాబలానికి ఒక పరిమితి అంటూ ఉండేది కాదు.  ఇప్పుడైతే వ‌రుస‌గా మూడోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చినా, మూడో సారి బీజేపీకి స్వయంగా వచ్చిన స్థానాలు   240 కాగా.. ఎన్డీయే  భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో ఎలాగోలా  గ‌ట్టెక్కి అధికార పీఠం చేప‌ట్ట‌గ‌లిగింది. అదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో అయితే అప్ప‌ట్లో  లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం  400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి  చేయ‌లేదు. ఎవ‌రి  క‌ష్టం  వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ చేస్తున్న ఆర్భాటాన్నీ, హంగామానూ బిల్డప్ ప్రక్రియగా కొట్టి పారేశారు.  ఏదో ఒక నేరేటివ్ బిల్డ‌ప్ చేయ‌డంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని  తెర‌పైకి తెచ్చారంటున్నారు. రాహుల్ అందిపుచ్చుకున్న ఓట్ చోరీ..  వ్యూహ‌క‌ర్త‌లిచ్చిన స‌ల‌హా  లేదా సూచ‌న  కావ‌చ్చు. అదీ కాదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వమే స్వయంగా ఈ నినాదాన్ని ఎత్తుకుని ఉండవచ్చు. అయితే ఓటు చోరీ నినాదం ప్రజల్లోకి లోతుగా వెళ్లినట్లనిపించినా.. అది కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చింది లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఓట్ చోరీ స్లోగ‌న్ తో బీహార్ ఎన్నిక‌ల‌కు వెళ్తే అది బూమ‌రాంగ్ అయ్యింది. రాహుల్ లాంటి ప్ర‌చార‌క్ ఉన్నంత వ‌ర‌కూ బీజేపీ  అధికారంలోకి వ‌స్తూనే ఉంటుంద‌న్న టాక్  అధికార కూటమిలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.  రాహుల్ విషయంలో చెప్పుకోవలసిందంటూ ఏదైనా ఉంటే ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర.  ఆ యాత్ర ద్వారా.. రాహుల్  ఇటు కాంగ్రెస్ ని అటు ఇండి కూట‌మిని  ఈ మాత్ర‌మైనా  నిలబెట్టగలిగారు.   అలాగ‌ని రాజ‌కీయ ప‌రంగా అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలాంటి చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌క పోవ‌డం వ‌ల్ల  కాంగ్రెస్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు.  కార్య‌క‌ర్త‌లను ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంచాలి.  అందులో భాగంగానే రాహుల్ గాంధీ.. ఈ నినాదం భుజానికి  ఎత్తుకున్నారు. త‌ర‌చూ త‌న వాద‌న‌ల రూపంలో  ఏదో ఒక అంశాన్ని, సమస్యను తెరమీదకు తీసుకువస్తుంటారు. తినగతినగ వేమ తియ్యగుండు అన్నట్లుగా.. నిరంతరం జనంలోకి ఏదో ఒక అంశాన్ని తీసుకువెడుతుంటే.. ఏదో ఒక లీడ్ దొరికి అధికారం ‘చేతి’కి రాకుండా ఉంటుందా అన్నది ఆయన ఆలోచనో, వ్యూహమో అయి ఉంటుందంటున్నారు పరిశీలకులు.   ఇవాళ్రేపు రాజ‌కీయంగా ఒక నెగిటివిటీని నూరిపోస్తే త‌ప్ప రాణించ‌లేని గ‌డ్డు కాలం న‌డుస్తోంది. అందుకే రాహుల్ ఈ దేశం నుంచి ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షాల‌ను పార‌దోలాల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంద‌నీ,  వారి ప్ర‌భావం నుంచి దేశాన్ని కాపాడాలని అంటున్నారు కానీ అది ఎలా సాధ్యం అన్న విషయంలో మాత్రం రాహుల్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ క్లారిటీ కానరావడం లేదంటారు పరిశీలకులు. ఓట్ చోరీ నినాదం విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉండటం యాధృచ్ఛికమేనా?  

జ‌గ‌న్ ‘పీపీపీ’.. డుం డుం డుం!

మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విధానాల‌ పై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎంత ఉందో తెలియ చేస్తూ కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల  నుంచి మెడికల్ కాలేజీల ప్రభుత్వ, ప్రైవేటు   భాగస్వామ్యం విధానానికి వ్యతిరేకంగా కోటీ  4 ల‌క్ష‌ల   ఈ సంత‌కాల సేక‌ర‌ణ చేసి గ‌వ‌ర్న‌ర్ కి స‌మ‌ర్పించారు జగన్.  ఈ సందర్భంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. జగన్ స్వయంగా 40 మంది బృందంతో కాలినడకన వెళ్లి మరీ ఆ సంతకాల పత్రాలను గవర్నర్ కు అందజేశారు. అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.  ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ఇంత‌కీ జ‌గ‌న్ అండ్ కో  పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ఏమిటంటే..   పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీ అభివృద్దికి ముందుకు వచ్చే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాపేక్షతోనే వస్తారు. కోట్లు కొల్లగొడతారు. దీని వల్ల పేదలకు వైద్య విద్య మ‌రింత ఖ‌రీద‌వుతుంది. ఇది వారి పాలిట ఆశ‌నిపాతంగా మారుతుంది. ఇదీ జగన్ అండ్ కో అంటే జగన్, వైసీపీయులు చేస్తున్న వాదన. ఇక కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించే సందర్భంగా  జగన్ హాట్ కామెంట్లు కూడా చేశారు. అందులో యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావించారు. యోగాంధ్ర కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం పేదల మెడికల్ విద్య కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు.  ఇక్కడే ఆయన ఆర్థిక అజ్ణానం బయటపడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం స్వయంగా ఖర్చు చేయడం లేదు.. ప్రైవేటు వ్యక్తులను ఆ వ్యయంలో భాగస్వాములను చేస్తున్నది. అదే పంధాలో సంక్షేమ పథకాలనూ అమలు చేస్తున్నది. జగన్ హయాంలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసి బటన్ నొక్కుడు అంటూ ఖజానా మొత్తం సంక్షేమం అంటే ధారపోసి జగన్ బావుకున్నదేంటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అంటే జగన్ కు ఘోర పరాజయం, రాష్ట్రానికి తలకు మించిన అప్పులు మాత్రమే.  ప్రభుత్వానికి తలకు మించిన భారం కాకుండా  ప్రైవేటు వ్య‌క్తుల‌ను కూడా ఇన్వాల్వ్ చేయ‌డం మంచిదే కదా అంటున్నారు ఆర్థిక నిపుణులు. జ‌గ‌న్  హయాంలో ఆయన రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇంకా అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పులు తెచ్చి మరీ సంక్షేమం అంటూ చేసిన పందేరం.. ఓట్ల వేటే తప్ప మరేదీ కాదంటున్నారు.  ఇటీవల వలంటీర్ల విషయంలో తనకు జ్ణానోదయం అయ్యిందని ఇటీవల జగన్ ప్రకటించారు. మరి అప్పులు చేసి రష్ట్ర ప్రగతిని శూన్యం చేసి అమలు చేసిన సంక్షేమం దారి తప్పిందన్న విషయంలో ఆయనకు ఇంకా జ్ణానోదయం కలిగినట్లు లేదంటున్నారు విశ్లేషకులు.   ప్ర‌తిదీ ప్ర‌భుత్వం నుంచే ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల అది  పెట్టుబ‌డి అనిపించుకోదు.   ప్ర‌భుత్వ‌మే  అన్నీ ఉచితంగా చేయ‌డం వ‌ల్ల ఎన్ని నిధులూ సరిపోవు. అప్పులే శరణ్యం అవుతుంది. అందుకే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నది చంద్రబాబు సర్కార్.  ఈ విషయం అర్ధం చేసుకోకుండా,  జగన్ ఇలాగే వ్యవహరిస్తే..  2029 కాదు.. 2034నాటికి కూడా  వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులే కాదు... వైసీపీయులు కూడా  అంటున్నారు.  ఎవరో అనడం ఎందుకు జగన్ తాను స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా అవే చెబుతున్నాయి కదా!  మరి జగన్  ఈ తీరు వైసీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే. 

ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టిన పంచాయతీ ఫలితాలు.. సీఎం రేవంత్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గురువారం (డిసెంబర్ 17) మీడియాతో మాట్లాడిన ఆఈయన ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు రిఫరెండంగా ఆయన అభివర్ణించారు.  పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.  మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందనీ, అంటే 66శాతం స్ట్రైక్ రేట్ సాధించిందనీ చెప్పిన రేవంత్, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైపోటీ చేశాయనీ, అయినా కూడా రెండు పార్టీలూ కలిపి 33 శాతం పంచాయతీల్లోనే గెలిచాయని రేవంత్ అన్నారు.   పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారన్న రేవంత్ రెడ్డి వారిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మొత్తం 8 వేల 335 పంచాయతీలలో జెండా పాతిందన్నారు.  ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 87 సెగ్మెంట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిందన్నారు.  అంటే  2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తామని స్పష్టమౌతోందన్నారు.  2028 ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయగలరా?!

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ భారతం ఆకలితో అలమటించేలా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రం ఈ పథకంలో ఉన్న లోపాలను సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది. పేదలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి వైదొలగుతోందని దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలోనే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు.  జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారు సరే.. భారత కరెన్సీ నోట్ల మీద నుంచి గాంధీ బోమ్మను తొలగించగలరా?  అని చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందనీ, దేశ సమగ్రత, సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నదని డికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. జగన్ పై చంద్రబాబు విజయం!?

తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. గత అసెంబ్లీ ఎన్నికలనాటి కంటే అధికంగా కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక రెండో స్ధానంలో బీఆర్ఎస్ నిలిచింది. బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై   తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది. అదేంటంటే మూడో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇదేంటి ఎన్నికలు జరిగింది తెలంగాణలో  ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై గెలవడమేంటి? అన్న ఆసక్తి కలిగించేలా సోషల్ మీడియాలో వార్త  హల్ చల్ చేసింది. ఇంతకీ విషయమేంటంటే..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ సంర్పంచ్ పదవికి పోటీ పడిన వారిలో ఒకరి పేరు భేక్య చంద్రబాబు కాగా, మరో వ్యక్తి పేరు బానోత్ జగన్నాథమ్. ఈ పేర్లే ఈ ఎన్నికను ఆసక్తిగా మార్చేశాయి.  ఈ ఎన్నికలో   భూక్య చంద్రబాబు  బానోత్ జగన్నాథమ్  బానోత్ జగన్నాథమ్ పై విజయం సాధించారు.  దీనిపైనే నెటిజనులు తెలంగాణలో కూడా జగన్ ను చంద్రబాబు ఓడించారు అంటూ సెటైరిక్ గా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  

సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతున్నారు. ఈ సారి చంద్రబాబు పర్యటన లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టులకు అనుమతుల సాధనే అంటున్నారు. నల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో చంద్రబాబు  ప్రధాని మోడీ,  జలవనరులశాఖ మంత్రి సిఆర్‌ పాటిల్‌ తో వేర్వేరుగా భేటీ కానున్నారు.నల్లమల సాగర్‌కు అనుమతులతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ పర్యటనలో కేంద్రాన్ని సిఎం కోరనున్నట్లు తెలుస్తోంది. 

పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా   ఉపాధి హామీ  పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.  ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే  ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే  దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ భగ్గు.. బీజేపీ కార్యాలయాల ముట్టడి

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి జరుగుతోంది. అఖిల భారత కాగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం (డిసెంబర్ 18)  దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల మట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  తెలంగాణలో కూడా  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే  అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధిస్తోందని కాంగ్రెస్  నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.    బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.