రాష్ట్రపతి గవర్నర్‌కు గడువు ఎలా విధిస్తారు.. సర్వోన్నత న్యాయస్థానంకు ద్రౌపది ముర్ము ప్రశ్న
posted on May 15, 2025 @ 9:12PM
దేశంలో ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెలరోజులు మాత్రమేనని 415 పేజీలతో కూడిన తీర్పును అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. రాజ్యాంగం లో అలాంటి నిబంధనలేవీ లేనప్పుడు కోర్టు అలా ఎలా తీర్పు ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు గా సమాచారం. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు తీర్పుపై 14 రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలపై సలహా కోరారు. ఈ ప్రశ్నల్లో రాజ్యాంగ అధికారాలు, పరిమితులు, శాసన ప్రక్రియలకు సంబంధించినవి ఉన్నాయి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టు నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది. భారత రాష్ట్రపతి ముర్ము అత్యున్నత ధర్మాసనంకు రాసిన లేఖపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ స్పందించారు. రాష్ట్రపతి ముర్ము కు మరో మూడు కీలక ప్రశ్నలు స్టాలిన్ సంధించారు.