జగన్ జైలుకే.. పొన్నవోలు కంటతడి సంకేతమదేనా?
posted on May 28, 2024 9:27AM
ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందా.. వైసీపీ అంతర్గత సర్వేల్లో ఆ విషయం స్పష్టమైందా.. కూటమి అధికారంలోకి రాగానే జగన్ బెయిల్ రద్దవుతుందా.. జగన్ ప్రమాదంలో పడబోతున్నారా..? ఐదేళ్ల కాలంలో చేసిన తప్పిదాలతో జగన్ కు కొత్త చిక్కులు చుట్టుముట్టబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇలాంటి సందేహాలను తెరపైకి తెచ్చింది ఎవరో కాదు.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి నమ్మినబంటుగా ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కేసుల విషయంలో న్యాయ సలహాలో జగన్ పక్షాన పొన్నవోలు ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ గా పొన్నవోలును జగన్ నియమించారు. ఈ ఐదేళ్ల కాలంలో జగన్ కనుసన్నల్లో పొన్నవోలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడంలో పొన్నవోలుదే కీలక పాత్ర.. అయితే, చంద్రబాబు అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారణ చేయలేక పోయారు. కేవలం కావాలనే జగన్ ఆదేశాల మేరకు చంద్రబాబును దాదాపు మూడు నెలలు రాజమండ్రి జైలులో ఉంచారు. పొన్నవోలు తీరుపై తెలుగుదేశం శ్రేణులతోపాటు కొందరు వైసీపీ నేతల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా జగన్ ఓటమికి పొన్నవోలు బీజం వేశారంటూ కొందరు వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వారి అనుమానమే ఇప్పుడు నిజం కాబోతుంది. కూటమి విజయం ఖాయమన్న ఓ స్పష్టత రావడంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక పొన్నవోలు కన్నీరు పెట్టుకున్నారు.
ఏపీలో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏపీకి తరలి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ నేతలు పోలింగ్ రోజు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఓటర్లను బెదిరించడంతోపాటు.. టీడీపీ ఏజెంట్లపై దాడులు సైతం చేశారు. అయినా, జగన్ ఐదేళ్ల అరాచక పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు అర్థరాత్రి 2 గంటల వరకు కూలైన్లలో వేచి ఉండి మరీ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వైసీపీ కుట్రలను ఛేదించుకొని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవటంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏపీలో 81శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. దీంతో వైసీపీ ఓటమి ఖాయమని ప్రతిఒక్కరికి అర్ధమైంది. వైసీపీ అధిష్టానం నిర్వహించిన అంతర్గత సర్వేల్లోనూ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టమైందని తెలుస్తోంది. అదే విషయాన్ని జగన్ కు నమ్మినబంటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పకనే చెప్పారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి వైసీపీ సానుభూతి పరులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీ ఓడిపోతోందనీ, జగన్ జైలుకు వెళ్లబోతున్నారని చెప్పకనే చెప్పారు.
ఎన్నికల తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో లండన్ పర్యటనకు వెళ్లారు. లండన్ లోని పలు ప్రదేశాల్లో ఆయన పర్యటిస్తున్న ఫొటోలు తాజాగా విడుదలయ్యాయి. మరో వైపు ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిసైతం లండన్ పర్యటనలో ఉన్నారు. స్థానికంగా వైసీపీ సానుభూతి పరులతో పొన్నవోలు సమావేశం అయ్యారు. జగన్ తో సమావేశమై మాట్లాడాలని ఉందని, ఓ సారి సమావేశం ఏర్పాటు చేయాలని స్థానిక వైసీపీ సానుభూతి పరులు పొన్నవోలును కోరారు. దీంతో పొన్నవోలు మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కన్నీరు పెట్టుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాటం చేస్తున్నారు.. ఆయన కష్టం నాకు తెలుసు.. ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసు. ఎవరు మనోడో తెలియదు.. ఎవరు పరాయోడో తెలియదు.. ఇప్పటికీ జగన్ లెక్కచేయడం లేదు.. ఏమైతే అది ఔతుందన్న ధీమాతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు అంటూ జగన్ గురించి పొన్నవోలు చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. వైసీపీ అనుకూల మీడియాలో మరోసారి మనమే అధికారంలోకి రాబోతున్నామని పోలింగ్ పూర్తయిన రోజునుంచి డంకా మోగిస్తున్నారు. జగన్ ప్రమాదంలో ఉన్నారని తాజాగా పొన్నవోలు మాట్లాడటంపై వైసీపీ కార్యకర్తలోనూ ఓడిపోతున్నామని క్లారిటీ వచ్చినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పక్కన ఉన్నవారు ఎవరు మనవాళ్లో.. ఎవరు పరాయివాళ్లో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొందరు భావిస్తున్నారు. అయితే, షర్మిలను దూరం చేసుకున్నది కూడా జగన్ మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇంట్లో తల్లి, చెల్లిని, ఆయన, వైసీపీ నేతలు మనుషుల్లా చూడలేదు. అవమానించి దూరం చేసుకున్నాడు. జగన్ చెప్పినట్లు నడుచుకున్న నేతలు మాత్రమే వైసీపీలో మిగిలారు. ఇదిలాఉంటే, పొన్నవోలు వ్యాఖ్యల్లో మరో ఆందోళనకూడా స్పష్టంగా కనిపించింది. జూన్ 4న ఫలితాల్లో కచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతుందని ఆయనకు తెలుసు. కూటమి అధికారంలోకి వస్తే జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఐదేళ్ల కాలంలో జగన్ అరాచక పాలన కారణంగా మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశమూ ఉంది. దీనికి తోడు వైసీపీ ఓడిపోతే ఆ పార్టీని వీడేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు బీజేపీ, టీడీపీ, జనసేన నేతలతో టచ్‌లోకి వెళ్లారు. జగన్ జైలుకెళితే వైసీపీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటిని గుర్తుచేసుకొని పొన్నవోలు కన్నీరు పెట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.