ఏడ్చిన పొన్నాల

 

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ఏడ్చారు. ఒక్కోసారి వయసు ఎంత పెరిగినా, ఏ స్థాయిలో వున్నా, ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న మగపురుషులైనా ఏడుపు వస్తుంది. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్యకు కూడా ఏడుపు వచ్చింది. ఎర్రగడ్డ ఆస్పత్రిని అనంతగిరి అడవుల్లోకి, సచివాలయాన్ని ఎర్రగడ్డకి తరలించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. పోలీసుల అనుమతి లేకపోయినప్పటికీ గాంధీ భవన్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర చేపట్టింది. అయితే సహజంగానే పోలీసులు ఈ పాదయాత్రని అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పెనుగులాడారు. పొన్నాలని అరెస్టు చేయబోతే ఆయన కూడా పెనుగులాడారు. దాంతో ఆయన భుజానికి చిన్న గాయం తగిలింది. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులందర్నీ పోలీసులు ఘోషామహల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆక్కడ పొన్నాల ఏడ్చినట్టు సమాచారం. ఆయన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఓదార్చినట్టు తెలుస్తోంది. మామూలుగా జానారెడ్డికి, పొన్నాలకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఓదార్పు సీను నడవటం వెరైటీ. అయితే పొన్నాల ఏడ్చిన విషయం తెలుసుకుని కొంతమంది అధికార పార్టీ నాయకులు పొన్నాలది దొంగ ఏడుపు అంటున్నారు. అయతే పొన్నాల ఎందుకు ఏడ్చినట్టు? అనవసరంగా తెలంగాణ ఇచ్చి ఇప్పుడిలా తన్నులు తింటున్నామేంటా అని ఏడ్చారా? నిజంగానే నొప్పిపుట్టి ఏడ్చారా? ఇంతబతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు మొన్నటి వరకు మంత్రిగా పనిచేసి పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకున్న తాను ఇప్పుడు వాళ్ళచేతే తన్నులు తిన్నానేంట్రా అనా... తెలంగాణ రాష్ట్రం నాశనమైపోతోందనా... ఏమో... పొన్నాల ఎందుకు ఏడ్చారో ఆయనకే తెలియాలి.

Teluguone gnews banner