Read more!

ప్రజాస్వామ్యమా మజాకా...

 

శుక్రవారంనాడు జరిగిన సహకార ఎన్నికలలో మన రాజకీయ పార్టీలు ఒకదానికొకటి ఎంత బాగా సహకరించుకొన్నాయో చూస్తే నిజంగా చాలా ముచ్చట వేసింది. రాజకీయ పార్టీలకతీతంగా సాగాల్సిన సహకార ఎన్నికలలోకి అన్ని రాజకీయపార్టీలు ప్రవేశించడమే కాకుండా, మళ్ళీ ఒకదానికొకటి సహకరించుకొని సహకార ఎన్నికల పేరు సార్ధకం చేసాయి కూడా. అయితే, ఈ సహకారం శాసనసభలో తమ జీతభత్యాలు పెంచుకొన్నపుడు తప్ప, మరెప్పుడు మనం చూసే భాగ్యానికి నోచుకోము.

 

ఎవరు గెలవాలో ఎవరు ఓడిపోవాలో పార్టీలే నిర్ణయించుకొంటే, వారి గెలుపోటములు తమ చేతులలో ఉన్నాయనే భ్రమలోఉన్న వెర్రి ప్రజలు చేంతాడంత వరుసలల్లో నిలబడి, తాము తమకి నచ్చిన వాళ్ళకే ఓటు వేస్తునామనే భ్రమలో ఓట్లు వేసి వచ్చారు. వచ్చేసాధారణ ఎన్నికలలో కూడా వారు అదే భ్రమలోనే ఓట్లు వేసోస్తారు.

 

ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వద్దు, ప్రజారాజ్యంకి తమ ఓటు వేద్దామనుకొంటే, అది మళ్ళీ వెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీలోనే కలిసింది. ఇప్పుడు భాజపా వద్దు అని తేదేపాకు ఓటువేస్తే, రేపు అది వెళ్లి భాజపాతోనే చేతులు కలపవచ్చును. తెరాసను కాదనుకొని తేదేపాకు వేస్తే అది తెరాసతోనే కలవొచ్చును. పోనీ వీరెవరూ వద్దు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేసుకొని జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకొందామని ప్రజలు అనుకొంటే, ఆనక ఆయన వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలవొచ్చును. అంటే ఓటు వేయడం వరకే ప్రజల బాధ్యత, ఆ తరువాత వారి అభీష్టానికి విలువలేదు, ఉండదు కూడా.

 

ఐదేళ్ళ కోసం ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకొంటే, అతను లేదా ఆమె తన రాజకీయ ప్రయోజనాలు దిబ్బతింటున్నాయని ఎప్పుడు భావిస్తే అప్పుడు తన పదవికి రాజీనామా చేసేసి, మళ్ళీ ప్రజా కోర్టులో తేల్చుకొంటానంటూ ప్రజల నెత్తిన ఎన్నికలు రుద్దడానికి ప్రయత్నించినప్పుడు, ప్రజలు కూడా హర్షిస్తారు తప్ప ఆ వ్యక్తిని నిలదీయాలనుకోరు. ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి మారడానికి తనని ఎన్నుకొన్న ప్రజల అనుమతి అవసరం లేదని భావిస్తే, ప్రజలు కూడా అవసరం లేదనే నమ్ముతారు. ప్రజా ప్రతినిధులు అన్నాక పార్టీలు మారకుండా ఉంటారా, అది రాజకీయాలలో సహజమే అని ప్రజల నమ్మేంతగా మన రాజకీయ పార్టీలు ప్రజలను మలుచుకోన్నాయి.

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్న9 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం చూస్తే, మన రాజకీయాలు ఎంత నీచ స్థాయికి దిగజారి పోయాయో అర్ధం అవుతుంది. ఇంతకాలం వారు జగన్ మోహన్ రెడ్డి అనుచరులని తెలిసిఉన్నపటికీ, వారి మద్దతు అవసరం గనుక ఇష్టమున్నా లేకున్నా వారితో అంటకాగిన కాంగ్రెస్, పరిస్థితులను భేరీజు వేసుకొని వారిని బయటకి పంపడం ద్వారా తనకి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమి లేదని నిర్దారించుకోన్నాక వారిని వదిలించు కోవాలనుకొంటే, ఇంతకాలం నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు అన్నీహుందాగా స్వీకరిస్తూ ఇప్పుడు ఎన్నికలు దగ్గిరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ నుండి తమని బయటకి పంపడాన్ని కూడా రాజకీయంగా తమకి అనుకూలంగా మార్చుకొని, ‘ఈ కాంగ్రెస్ పార్టీలోంచి’ ‘ఆ కాంగ్రెస్ పార్టీలోకి’ మారనున్నారు. మళ్ళీ రేపు ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలు దగ్గరయితే, మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ భాయి భాయి అంటూ వారందరూ కలిసిపోయినా మనం ఆశ్చర్యపడనవసరం లేదు.

 

ఇది మన రాజకీయ పార్టీలన్నిటికీ వర్తించే సూత్రం. ఏపార్టీ ఎవరితోనయినా జత కట్టవచ్చును, విడిపోవచ్చును. ప్రజలు కూడా వాటి పొత్తులు, పోరాటాల గురించి ప్రశ్నించే బదులు ఎవరు ఎప్పుడు ఎవరితో కలుస్తారు ఎప్పుడు ఎందుకు విడిపోయారు అని మాత్రమే ఆలోచించే స్థాయికి ఎదిగిపోయారు గనుక, మన ప్రజాప్రతినిధులకి కూడా ప్రజలేమనుకొంటారో అనే టెన్షన్ లేకుండా హాయిగా పార్టీలు మార్చుకొంటూ, రాజీనామాలు చేసుకొంటూ, మధ్యంతర ఎన్నికలు పెట్టుకొంటూ ముందుకు సాగిపోతుంటే, ప్రతీ సారీ వెర్రి ప్రజలు చేంతాడంత వరుసలల్లో నిలబడి మళ్ళీ మళ్ళీ వారికే ఓట్లేస్తూ మన ప్రజాస్వామ్యాన్ని బహు చక్కగా కాపాడుకొస్తున్నారు.