గణేష్ నిమజ్జన శోభాయాత్రపై రాజకీయమా?
posted on Sep 7, 2022 @ 10:57AM
రాజకీయ ప్రయోజనమే ఏకైక లక్ష్యం. అందు కోసం సమాజానికి హాని జరిగే పరిస్థితులు ఏర్పడినా పట్టించుకోకపోవడమే నేటి పార్టీల వైఖరిగా మారిపోయింది. కుల మతాలకు అతీతంగా ఒక సామాజిక ఉత్సవంలా ఏటా హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవానికి రాజకీయ మకిలి అంటించేందుకు కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వెరవడం లేదు.
మరీ ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ అవకాశాన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలన్న ఆత్రం, తాపత్రయంతో పార్టీలు మంచి చెడుల విచక్షణ కోల్పోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, తెరాసల ఈ విషయంలో ముందు వెనుకలు ఆలోచించకుండా ఎన్నికల లబ్ధి కోసం వెంపర్లాడుతున్నాయి. గణేష్ మండపాల నుంచి నిమజ్జనాల వరకూ పార్టీలు తమతమ రాజకీయ లబ్ధి కోసం వివాదాలు సృష్టిస్తున్నాయి.
సామరస్య వాతావరణం దెబ్బతినే పరిస్థితి వచ్చినా వెనుకాడటం లేదు. ఇప్పుడు వినాయక నిమజ్జనం విషయంలో కూడా బీజేపీ, తెరాసలు ప్రమాదకరమైన రాజకీయ క్రీడకు తెర లేపాయి. వినాయక నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేయడం లేదంటూ బీజేపీ తీవ్ర పదజాలంతో విమర్శలకు తెరలేపింది. ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా చేయకున్నా ట్యాంక్ బండ్ పైకి నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తామనీ, హుస్సేన్ సాగర్ లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తామనీ బీజేపీ ప్రకటించింది. హుస్సేసాగర్ జలాలు కలుషితం కాకూడదన్న ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారెస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అధికారికంగా హుసేన్ సాగర్ ఒడ్డున గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది.
ఎందుకంటే గణేష్ మండపాలలో ప్రతిష్టించిన విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసినవే. అయితే గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడాన్ని బీజేపీ విమర్శిస్తున్నది. కేవలం హిందూ పండుగలపైనే ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తున్నారంటూ సున్నిత అంశాలను తెరపైకి తీసుకువచ్చి రచ్చ చేస్తున్నది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సజావుగా సాగనివ్వకుండా అడ్డుకోవాల ప్రభుత్వం చూస్తోందనీ, వచ్చే ఏన్నికలలో ఒక వర్గం మద్దతు కొసం ఆ వర్గం మెప్పు కోసమే సర్కార్ ఇలా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతే కాకుండా ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని అడ్డుకుంటే వాటిని ప్రగతి భవన్ కు తీసుకొస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
సాగర్ లో కాదు ప్రగతి భవన్ లో గణేష్ నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ ప్రకటించడంతో వివాదం మరో లెవెల్ కు వెళ్లింది. ఓ వైపు గణేష్ ఉత్సవ కమిటీ మరో వైపు బీజేపీ కేసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే నిరశన దీక్షకూ దిగాయి. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఉన్న ప్రాధాన్యత తెలిసి కూడా ఏర్పాట్ల విషయంలో కేసీఆర్ సర్కార్ పట్టనట్టు వ్యవహరించడం వెనుక కూడా రాజకీయమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ పరస్పర విమర్శలకు దిగడమే కాకుండా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సమయం సమీపిస్తున్నా అందుకు సంబంధించిన ఏర్పాట్ల ఊసే లేకపోవడంతో నిమజ్జనం రోజున ఏ అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.
గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం, అనంతరం గణేష్ శోభాయాత్రా ఒక సామాజిక కార్యక్రమంలా జనంలో సామరస్యం వెల్లివిరిసేలా నిర్వహించుకోవడం ఒక సంప్రదాయంగా వస్తున్న తరుణంలో రాజకీయం కోసం ఇటువంటి వాతావరణం ఏర్పడేలా రాజకీయ పార్టీలు వ్యవహరించడం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాలుష్యం కారణంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం హుస్సేన్ సాగర్ లో నిర్వహించరాదంటూ గత చాలా కాలంగా పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేస్తున్న సంగతి విదితమే. అదే సమయంలో కోర్టు కూడా కొన్ని ఆంక్షలతో సూచనలూ చేసింది. అయితే గణేష్ నవరాత్రులకు ముందు నుంచే పర్యావరణ హిత ఉత్సవాల కోసం ప్రజలలో అవగాహన పెంచేలా భారీ ఎత్తున ప్రచారం చేయాల్సిన ప్రభుత్వం ఆ సమయంలో మౌనంగా ఉండి, ఇప్పుడు గణేష్ నిమజ్జన విషయంలో ఆంక్షలున్నాయంటూ ఏర్పాట్లు చేయకపోవడాన్నీ పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా పరిస్థితి మరింత విషమించక ముందే ప్రభుత్వం నడుంబిగించి.. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.