భైంసా అల్లర్లు.. నిజం ఏంటి ?
posted on Mar 17, 2021 @ 3:51PM
అక్కడ ఏమి జరుగుతోంది ? ఇది ఎదో ఒక సారి కాదు.. పదే పదే వినిపించే ప్రశ్న. నిర్మల్ జిల్లా భైంసాలో గడచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మత ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ ఏమి జరుగుతోంది అనేది ఎవరికీ తెలియని రహస్యంగానే ఉండి పోతుంది. ఇదొక మిస్టరీ. పోలీసులదీ అదే పరిస్థితి.
భైంసాలో మతఘర్షణలు జరిగిన ప్రతిసారీ పోలీసుల విశ్వసనీయత ప్రశ్నార్ధకంగానే మారుతోంది. ప్రభుత్వంతో పాటుగా పోలీసు యంత్రాంగం ఒక వర్గానికి కొమ్ముకాస్తోందనే ఆరోపణలు అన్ని సందర్భాలలోనూ వినిపిస్తూనే ఉన్నాయి. అయినా అటు ప్రభుత్వం కానీ, ఇటు పోలీసులు కానీ ‘మచ్చా మంచిదే’ అనుకుంటున్నారో ఏమో కానీ, నిక్ష్పక్షపాత విచారణకు ఆదేశించి, నిజాన్ని నిక్కుతీయడంతో పాటుగా, తమ విశ్వసనీయతను నిరూపించుకునే ప్రయత్నం చేయడం లేదు. అందుకే
పోలీసులు బోనులో నిలవవలసి వస్తోంది.
తాజాగా గతవారం జరిగిన మత ఘర్షణలకు సంబంధించి కూడా పోలీసుల కథనం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి. భైంసాలో జరిగిన జరిగిన అల్లర్లలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అంటూనే నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి అల్లరకు ప్రధాన కారణం హిందూవాహిని కార్యకర్తలే అని, ఇందులో ఇంకెవరి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఇలా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకోవలసి వచ్చిందంటేనే, ‘దాల్ మే కుచ్ కాలా హై’ అన్న అనుమానం వస్తుంది. అదీకాక పోలీసులు కానీ మరో వ్యవస్థ కానీ, నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరిస్తున్నట్లు కనిపించాలని, న్యాయ నిపుణులు అంటారు. ఈ విషయంలో అయితే పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
సరే ఐజీ చెప్పినట్లుగా అల్లర్లను ప్రేరేపించింది, హిందూవాహిని కార్యకర్తలే అనుకున్నారోజుల తరబడి అల్లర్లు కొనసాగడానికి, ఇంకా ఇప్పటికీ అక్కడ కర్ఫ్యూ కొనసాగడానికి కారణం ఏమిటి? మత ఘర్షణలు జరిగిన ప్రతి సారీ, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెపుతున్న పోలీసు బాసులు,ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారు? అంటే సమాధానం లేదు. సమాధానం లేదంటే చిత్తశుద్ధి లేదని అనుకోవచ్చునేమో.
ఈ అల్లర్లలో పోలీసుల లెక్క ప్రకారమే ఇద్దరు జర్నలిస్టులతో పాటుగా మొత్తం 12 మదికి గాయలయ్యాయి.13 షాపులు, 4 ఇళ్లు, 4 ఆటోలు, 6 ఫోర్‌వీలర్లు, 5 టూవీలర్లను దహనమయ్యాయి. ఇందుకు సంబదించి 26 కేసులు పెట్టి 42 మందిని అరెస్ట్ చేశారు, బాగుంది. ఇంత జరుగుతుంటే, ఒకే వర్గానికి చెందినవారు ఈ దాడులకు పాల్పడుతుంటే ప్రత్యర్ధి వర్గం ‘మూడు కోతుల బొమ్మల్లా’ ఉండి పోయారా? ఇలాంటి నమ్మశక్యం కాని కథలు చెప్పడం వల్లనే పోలీసులు విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.
ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మూలాలలోకి వెళ్లి సమగ్ర విచారణ జరిపించి, న్యాయం జరిపిస్తే
పడిన మచ్చపోతుంది. కాదంటే అల్లరులు ఆగవు, అనుమానాలు తీరవు..