పైలెట్ గుర్రు.. విమానం తుర్రు..
posted on Aug 14, 2014 @ 4:54PM
ముంబై నుంచి బ్రసెల్స్ వెళ్తున్న జెట్ ఎయిర్వేస్కు చెందిన ఈ బోయింగ్ 777 విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తోంది. ఇంతలో ఆ విమానం అకస్మాత్తుగా ఐదు వేల అడుగుల కిందకి దిగిపోయింది. విమానంలో వున్న ప్రయాణికులు ఇదేంటా అనుకున్నారు. అయినా పైలెట్ అన్నీ చూసుకుంటాళ్ళే మనకెందుకు భయం అనుకున్నారు. అక్కడే ప్రయాణికులు పప్పులో కాలేశారు. విమానం ప్రయాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పైలెట్ ఆ సమయంలో కాక్‌పిట్‌లోని తన సీట్లో కూర్చుని హాయిగా నిద్రపోతున్నాడు. సాధారణంగా విమానాలు దూర ప్రయాణం చేస్తున్న సమయంలో పైలెట్లకు కాసేపు నిద్రపోయే అవకాశం వుంటుంది. అయితే ఆ సమయంలో కో పైలెట్ అలెర్ట్.గా వుండాలి. అయితే ఈ విమానంలో పైలెట్ నిద్రపోతున్న సమయంలో ఆ విమానంలో వున్న మహిళా కో పైలెట్ హాయిగా తన ట్యాబ్‌ను చూసుకుంటూ కూర్చుంది. పైలెట్, కో పైలెట్ ఇద్దరూ పట్టించుకోకపోవడంతో ఆ విమానం అకస్మాత్తుగా ఐదు వేల అడుగుల కిందకు దిగిపోయింది. ఆ ప్రాంతంలో 34వేల అడుగుల ఎత్తున ప్రయాణించాల్సిన విమానం 29వేల అడుగుల ఎత్తునే ప్రయాణిస్తుండటంతో అంకారా ఏటీసీ ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే విమానానికి ప్రమాద హెచ్చరిక పంపింది. దాంతో ఎంచక్కా ట్యాబ్‌తో ఆడుకుంటున్న కో పైలెట్టమ్మకి తెలివొచ్చి విమానాన్ని అదుపు చేసింది. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇది చాలా తీవ్రమైన తప్పిదమని తేల్చిన జెట్ ఎయిర్వేస్ సంస్థ.. పైలట్లిద్దరినీ గ్రౌండింగ్ చేసి దర్యాప్తు చేస్తోంది.