శవయాత్రల్లో భగవద్గీత పెడితే భౌతిక దాడులే.. బండి
posted on Aug 18, 2022 @ 10:53PM
భగవద్దీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు. తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన గురువారం (ఆగస్టు 18) జనగామలో అర్చక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలతో సమావేశమయ్యారు. భగవద్గీత వినిపిస్తే ఎవరైనా మరణించారా అని అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ గతంలో ప్రశాంతతకు భగవద్గీత వినేవారని అన్నారు.
ఇకపై ఎవరైనా మహాప్రస్థానం (అంతిమయాత్ర) లో భగవద్గీత వినిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శవయాత్రల్లో భగవద్గీతను పెట్టకూడదని అలా చేస్తే భౌతిక దాడులు చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడు ఎన్నికలపై కూడా మాట్లాడారు. అలాగే మునుగోడు ఎన్నికలను దృష్టిలో టికెట్ కోసం ఆశావహులు లాబీయింగ్ లు వంటివి బీజేపీలో కుదరవన్నారు. ఆగస్టు 21న మునుగోడులో నిర్వహించ నున్న సభకు భారీగా జనసమీకరణ ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. సభ తరువాత కూడా బీజేపీ అగ్ర నేతలు మునుగోడులోనే మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరగనున్న ఉప ఎన్నిక కావడంతో టీఆర్‌ఎస్ కాంగ్రెస్,బీజేపీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
మరీ ముఖ్యంగా బీజేపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక విజయం అత్యంత కీలకం. ఇక కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా మునుగోడు ఉప ఎన్నిక గెలిచి తీరాల్సిన సవాల్. ఇక అధికార టీఆర్‌ఎస్ విషయానికి వస్తే ఈ ఉప ఎన్నికలో విజయం ఆ పార్టీకి అత్యంత కీలకం. మూడు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఉప ఎన్నికలో విజయానికి సర్వ శక్తులూ ఒడ్డుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు బై ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది.