సజ్జల పోయి.. పేర్ని వచ్చే!
posted on Jun 27, 2024 @ 11:56AM
ముల్లు పోయి కత్తి వచ్చే ఢాంఢాంఢాం.. అన్నట్లుగా ఇప్పుడు వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా ఇన్నాళ్లూ జగన్ కు కళ్లు, చెవులూ, ముఖం అన్నట్లుగా వ్యవహరించి, జగన్ సర్కార్ లో సకల శాఖల మంత్రిగా సర్వ అధికారాలూ చెలాయించిన గత ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జలకు ఇప్పుడు పార్టీలో సీన్ అయిపోయింది. ఆయన సినిమాకు శుభం కార్డు అని చెప్పలేం కానీ ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇప్పుడు ఆయన జగన్ పక్కన కాదు కదా అయన కంటి చూపుకు కూడా కనిపించకుండా దూరం దూరంగా మెలుగుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పార్టీ సమావేశాలలో ఎక్కడో వెనుక సీట్లో కనిపించీ కనిపించకుండా ఉన్న ఆయన ఉనికే ఇందుకు నిదర్శనం. అసలు జగన్ వైసీపీ పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచీ పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉన్న జగన్ కేసులలో ఏ2 అయిన విజయసాయిరెడ్డి స్థానాన్ని2019 తరువాత సజ్జల ఆక్రమించారు. అప్పటి నుంచీ పార్టీ పరాజయం వరకూ సజ్జల దాదాపు షాడో సీఎంగా వ్యవహరించారు. అలాగే పార్టీ వ్యవహారాల్లో కూడా తన మాటే ఫైనల్ అన్న స్థాయిలో పెత్తనం చెలాయించారు.
అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న క్షణం నుంచీ సజ్జల ప్రభ మసకబారుతూ వచ్చింది. ముఖ్యంగా పార్టీలో ఇంకా మిగిలిన నేతలు, క్యాడర్ కూడా ఓటమి బాధ్యత అంతా సజ్జలదే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో అంటే ఎన్నికలకు ముందు ఒక దశలో పార్టీలో సజ్జల వ్యతిరేకులంతా ఏకమై ఆయనకు వ్యతిరేకంగా జగన్ కు ఫిర్యాదు చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే జగన్ ఎవరి మాటా వినే రకం కాకపోవడంతో వారి ఫిర్యాదు ఏమిటి అన్న విషయాన్ని పట్టించుకునేందుకు కూడా ఆయన ఇష్ట పడలేదు. అదే విధంగా అంత కంటే ముందు.. అంటే జగన్ తన క్యాబినెట్ ను పునర్వ్యవస్థీకరించిన సమయంలో మంత్రి పదవులు పోయిన వారు, పదవి ఆశించి నిరాశ చెందిన వారూ కూడా సజ్జలనే టార్గెట్ చేస్తూ ఆందోళనలకు దిగారు, విమర్శలు గుప్పించారు. అయితే వాటిని వేటినీ జగన్ ఖాతరు చేయకపోవడంతో వారు అప్పటికి మౌనం వహించారు.
ఇప్పుడు పార్టీ చరిత్ర ఎన్నడూ చూడని విధంగా అత్యంత అవమానకరమైన ఓటమిని మూటగట్టుకుంది. దీంతో పార్టీలో ఇప్పుడు సజ్జలకు వ్యతిరేకంగా గళాలు గట్టిగా వినిపిస్తున్నాయి. జగన్ కూడా పార్టీ పరాజయం తరువాత సజ్జన పనితీరు పట్ల ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారనీ పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పార్టీలో సజ్జల స్థానాన్ని దక్కించుకునేది ఎవరన్న చర్చ సహజంగానే మొదలైంది.
అయితే పార్టీ వ్యవహారాల్లో ఇటీవల అంటే వైసీపీ ఘోర పరాజయం తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు ముఖం చాటేస్తుంటే.. పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి అధికార తెలుగుదేశంపై దూషణలతో ప్రసంగాలు దంచేస్తున్నారు. దీంతో ఇప్పుడు జగన్ కు ఇప్పుడు పేర్ని నాని కళ్లూ, చెవులుగా వ్యవహరిస్తున్నారా? సజ్జలను వెనక్కు నెట్టేసి ఆ స్థానాన్ని ఆక్రమించారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ మార్పుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ముల్లూ పోయి కత్తీ వచ్చే అంటే సజ్జల లూప్ లైన్ లోకి వెళ్లి లైమ్ లైట్లోకి పేర్నివచ్చాడంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. సజ్జల వల్ల పార్టీకి జరిగిన నష్టానికి ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం ఇప్పుడు పేర్ని నాని తన నోటి దూలతో చేయబోతున్నారని జోస్యం చెబుతున్నారు.
ఇందుకు ఉదాహరణగా జగన్ తన హయాంలో తమ్మినేని సీతారాం ను స్పీకర్ గా ఎన్నుకున్నప్పటి చంద్రబాబు కానీ, తెలుగుదేశం సభ్యులు కానీ ఆయనను స్పీకర్ స్థానం వరకూ తోడ్కొని వెళ్లలేదని పేర్ని నాని చెప్పడాన్ని ఎత్తి చేపుతున్నారు. అయితే పేర్ని నాని చెప్పింది పూర్తి అవాస్తవమని చెప్పేందుకు నాడు తమ్మినేని సీతారాం ను స్పీకర్ స్థానం వరకూ తోడ్కొని వెళ్లిన వారిలో తెలుగుదేశం సభ్యులు అచ్చెంనాయుడు, నిమ్మల రామానాయుడు ఉన్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ ను పోస్టు చేస్తూ.. అలవోకగా పచ్చి అబద్ధాలు మాట్లాడి అడ్డంగా బుక్కైపోవడం పేర్ని నానికి కొత్తేమీ కాదని అంటున్నారు.
అదే విధంగా అచ్చెన్నాయుడు జగన్ ను హత్య చేయాలన్నారంటూ పేర్ని నాని చేసిన ఆరోపణ కూడా అభూత కల్పనే అంటున్నారు. అచ్చెన్నాయుడు తన ప్రసంగంలో జగన్ ను రాజకీయంగా లేకుండా చేయాలని అన్నారని వారు సోదాహరణంగా వివరిస్తున్నారు. అదే సమయంలో మాజీ స్పీకర్ అంటే జగన్ హయాంలో సభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం చంద్రబాబునాయుడిపై నేరుగా అనుచితంగా, ఒక విధంగా ఆయనను బెదరిస్తూ మాట్లాడిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ పేర్ని నాని వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు.