Read more!

బందరులో పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ వీరంగం!

ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని నాటకాల్లో నటనను పండిస్తే, ఇప్పుడు పేర్ని కిట్టు రౌడీయిజంలో నటనను పండిస్తున్నాడు. పేర్ని నాని ఇంతకాలం నియోజకవర్గంలో అరాచకాలు చేశారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకున్న పేర్ని కిట్టు ఆ అరాచకాలను కంటిన్యూ చేస్తున్నాడు. తండ్రి ఎమ్మెల్యే, మంత్రి అయ్యాక, కాస్త ముదిరాక  అరాచకాలు చేస్తే, పేర్ని కిట్టు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడే టాలెంట్ చూపించడం ప్రారంభించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ప్రూవ్ చేసుకుంటున్నాడు.

ప్రశాంతంగా వుండే మచిలీపట్నంలో అరాచకాలకు శ్రీకారం చుట్టిందే పేర్ని నాని. ఇప్పుడు పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం పేరుతో అరాచకాలకు అన్నప్రాశన చేసుకుంటున్నాడు. పేర్ని కిట్టు అభ్యర్థిత్వాన్ని వైసీపీ నాయకులలో చాలామంది అంగీకరించడం లేదు. అందుకే వారు పేర్ని కిట్టుతో కలసి ప్రచారం చేయడం ఇష్టం లేక దూరంగా వుంటున్నారు. మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్‌తో స్నేహసంబంధాలు, వ్యాపార అనుబంధాలు కొనసాగిస్తున్న పేర్ని కిట్టు ఇప్పుడు ఆ బ్యాచ్‌నే వెంటేసుకుని మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు.

పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్‌తో కలసి చేస్తున్నది పేరుకే ప్రచారం. అతని ప్రధాన టార్గెట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులే. ప్రచారం పేరుతో  కూటమి నాయకుల ఇళ్ళ దగ్గరకి వెళ్తున్న పేర్ని కిట్టు తన గంజాయి బ్యాచ్‌తో కూటమి నాయకుల ఇళ్ళముందు మందుగుండు సామగ్రి విసురుతూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అదేమని ప్రశ్నిస్తే కూటమి నాయకులతో గొడవకి దిగుతూ, వారి ఇళ్ళలోకి వెళ్ళి విధ్వంసం సృష్టిస్తున్నారు. మొన్నీమధ్య పోతేపల్లిలో జనసేన కార్యకర్త మీద దాడి చేశారు. నిన్న కోన గ్రామంలో తెలుగుదేశం నాయకుడి మీద దాడి చేశారు. ఈరోజు మచిలీపట్నం ఎనిమిదో డివిజన్లో జనసేన నేత కర్రి మహేష్ ఇంటి మీద మీద గంజాయి బ్యాచ్‌తో దాడి చేయించాడు.

గురువారం నాడు మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ వీధిలోకి గంజాయి బ్యాచ్‌తో కలసి ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు కర్రి మహేష్ ఇంటి ముందు బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ మహేష్ ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా కర్రి మహేష్ కుటుంబ సభ్యులు, పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ మధ్య తోపులాట జరిగింది. 

తమ ఇంటి ముందు పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ దాడి చేసిందని కర్రి మహేష్ కుటుంబ సభ్యులతో కలసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దాంతో జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాయి. ఆందోళన చేస్తున్న జనసేన, టీడీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ సంఘీభావం పలికారు. కర్రి మహేష్ ఇంటి మీద దాడి చేసిన పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్‌ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. 

ఇదిలా వుంటే, అధికారంలోకి రాకముందే పేర్ని కిట్టు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు.. రేపు పొరపాటున అధికారంలోకి వస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా వుంటుందోనని మచిలీపట్నం ఓటర్లు భయపడుతున్నారు.