ఎన్నికల కోసం ఓటరు ఎదురు చూపు!.. సీఓటర్ సర్వే తేల్చిన వాస్తవం ఇదే!
posted on Sep 20, 2023 @ 4:42PM
నిండా మునిగినవాడికి చలేమిటని సామెత. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కూడా అలాగే సాగుతున్నాయా? అంటే సామాన్య ప్రజానీకం నుంచి మేధావులు, మధ్య తరగతి ప్రజలు మొదలు, అన్ని వర్గాల ప్రజల నుంచి అవునన్న సమాధానమే వస్తోంది.
నిజానికి ప్రజలు, మధ్య తరగతి మేధావులే కాదు, గత ఎన్నికల్లో ఏదో ఆశించి వైసేపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన వైసీపీ ఓటర్లు కూడా ఎంత త్వరగా ఎన్నికలొస్తే రాష్ట్రానికి అంత మంచిదని అంటున్నారు. అంతే కాదు చివరకు క్షేత్ర స్థాయి వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సైలెంట్ గానే అయినా, వైసీపీ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో చంద్రబాబు అంతటి సీనియర్ నాయకుడిని, అక్రమంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపి వేధింపులకు గురిచేయడాన్ని, ఆయనతో పాటుగా,ఆయన్ని అయన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్న తీరును పార్టీలకు అతీతంగా సామాన్య ఓటర్లు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నారు.
నిజం. చట్టాని చుట్టేసి, ఇష్టారాజ్యంగా రాజ్యంగ విరుద్ధ పరిపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి పాలనపై విసుగెత్తిన ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వైసీపీ ప్రభుత్వాన్ని వదిలించుకోవచ్చనే ఆలోచన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వైసేపీ మంత్రులు, నాయకులు చేస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో సంపూర్ణ వ్యతిరేకత వ్యక్త మవుతోంది. ఇప్పటికే వంద తప్పులు చేసిన జగన్ రెడ్డి చద్రబాబును అరెస్ట్ చేసి, నూటొక్క తప్పులు పూర్తి చేసి ప్రజాగ్రహాన్ని కొని తెచ్చుకున్నారని అంటున్నారు.
ఇదే నిజాన్ని సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులపై సి ఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సి ఓటర్ సర్వేను ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి విపరీతమైన సానుభూతి వచ్చిందని సి ఓటర్ సర్వేలో వెల్లడైంది. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని సర్వే తెలిపింది.
చంద్రబాబు అరెస్ట్‌తో జగన్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందని సి ఓటర్ సర్వే తేల్చింది. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం తథ్యమని వెల్లడించింది. జనసేన పొత్తుతో చంద్రబాబు మరోమారు, ముఖ్యమంత్రిగా సభలో కాలుపెట్టడం ఖాయమని సర్వే తేల్చింది. ఆయన అరెస్ట్ తో తెలుగు దేశం పార్టీకి, పెద్దగా నష్టం జరగదని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారని, అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెపుతే వినే రకం కాదు కాబట్టి, వాస్తవ పరిస్థితిని ఆయన ముందు ఉంచలేక పోతున్నామని వైసేపీ నేతలు సర్వే బృదంతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకే, వైసీపీ నాయకులు ఓటమికి మానసికంగా సిద్దం కావడంతో పాటుగా, ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.