చెట్లని తొలగిస్తే ఊరుకోము... పర్యావరణం పట్ల ప్రజలకు ప్రేమ మొదలైంది
posted on Nov 16, 2019 @ 12:01PM
పొగ కమ్మేసి ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ చూస్తుంటే మనం సేఫ్ జోన్ లో ఉన్నామనే మాట ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. ఇదే సమయంలో తెల్లాపూర్ మార్గాల్లో చెట్ల తొలగింపు పై దుమారం రేగుతోంది. నల్లగండ్ల సమీపం తెల్లాపూర్ మార్గంలో చెట్ల తొలగింపు పై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్ల నరికివేతను నిలిపి వేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. అటవీ శాఖ అనుమతులు లేకుండా పచ్చని చెట్లను నరికేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గతంలో తెల్లపూర్ జంక్షన్ నుంచి నాగులపల్లి వరకు రేడియల్ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు ఆర్ అండ్ బీ అధికారులు. అందుకోసం అడ్డుగా ఉన్న చెట్లు తొలగించటానికి అటవీ శాఖ అనుమతి కోరారు. ఫారెస్టు డిపార్ట్ మెంట్ అభ్యర్థన మేరకు సెంట్రల్ హైదరాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్ సర్వే చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా 134 చెట్లు ఉన్నట్లు గుర్తించారు. అందుకు సంబంధించిన రిపోర్ట్ ను 2016 అక్టోబర్ లో సమర్పించారు. 2017 మేలో జిల్లా ట్రీ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇతర అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించారు. అక్కడున్న చెట్లు రీలొకేషన్ కు అనుకూలమైనవి కావని కమిటీ సభ్యులు చెప్పారని.. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చెట్లు తొలగించేందుకు అంగీకరించినట్లుగా అటవీ అధికారులు చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో చెట్ల ను తొలగించేందుకు ఆర్ అండ్ బీ అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈ చెట్ల తొలగింపు ప్రక్రియను 2018 , డిసెంబర్ లోపు పూర్తి చేయాలని సూచించగా.. గడువులోపు చెట్లను తొలగించలేకపోయారు.
అయితే మూడు రోజుల కిందట చెట్ల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.తాము అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ పనులు ప్రారంభించామన్నారు అధికారుల. వెనువెంటనే స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. తాము చెట్ల తొలగింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని గతంలో ఇచ్చిన అనుమతులకు సమయం ముగిసిందని తేల్చి చెప్పేశారు. దీంతో చెట్ల తొలగింపును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వమని స్థానికులు భీష్మించుకుని కూర్చున్నారు.