కరోనా వాక్సిన్ వచ్చినా వేయించుకోమంటున్న జనం
posted on Aug 11, 2020 @ 3:45PM
బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న ఆస్ర్టజనికా వాక్సిన్ అతి త్వరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చే మొదటి వాక్సిన్ గా ప్రాచుర్యం పొందింది. కానీ అదే బ్రిటన్లో యువజనం మాత్రం ఆక్స్ ఫర్డ్ కాదు కదా ఏ కంపెనీ వాక్సిన్ వచ్చినా కరోనాకు వాక్సిన్ వేయించుకోమంటున్నారట. ఆశ్యర్యకరమైన ఈ విషయాలు ప్రతిష్టాత్మక కింగ్ కాలేజీ లండన్ నిర్వహించిన ఒక క్విక్ సర్వేలో బయడపడ్డాయి. సర్వే నిర్వాహకులు 34 సంవత్సరాల లోపు యువతలో 22 శాతం మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని వెల్లడించారు. అదే 55- 75 సంవత్సరాల వయసులో మాత్రం వాక్సిన్కు సుముఖత ఎక్కువగా ఉందట. వారిలో కేవలం 10 శాతం మంది మాత్రం వాక్సిన్ వేయించుకునే విషయంలో పూర్తి సముఖతతో లేరట.
ప్రభుత్వం చెప్పే విషయాల మీద నమ్మకం లేకపోవడం, వాక్సిన్ లు అనారోగ్యం కలగచేస్తాయనే రకరకాల కుట్ర సిద్ధాంతాల మీద నమ్మకం ఉండటం వల్ల వీరు వాక్సిన్ వేయించుకోకపోవడానికి సిద్ధంగా లేరని సర్వే నిర్వాహకులు తెలిపారు. విచిత్రంగా ఉన్నా ఇది నిజం ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వాక్సిన్ల తయారీని, వాక్సిన్ ఆరోగ్యం మీద చూపే ప్రభావం మీద రకరకాల అనుమానాలు వ్యక్తం చేసే వ్యాక్సిన్ వ్యతిరేక బృందాలు చాలానే ఉన్నాయి.ముఖ్యంగా లెఫ్ట్ మరియు ఉదారవాద గుంపులు ఇటువంటి వాదనలు చేస్తుంటాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ అయితే వీళ్ళని పిచ్చవాళ్ళ గుంపు అని కూడా తిట్టాడు. అమెరికాలో అయితే అధ్యక్షుడిగా మళ్ళీ ట్రంప్ ఎన్నికను వ్యతిరేకించే వారిలో చాలా మంది వాక్సిన్ సిద్దాంత వ్యతిరేకులే. అయితే కరోనా విషయంలో వీరింకాపెద్ద ఎత్తున ఆరోపణకు దిగలేదు. కానీ జనం మాత్రం భయపడుతున్నారని కింగ్ జార్స్ కాలేజీ సర్వేతో తేలింది. ఈ వ్యతిరేకత కరోనా వ్యాప్తి కట్టడికి అవరోధం కూడా కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.
ఇంతకీ వాక్సిన్ వద్దనే వారు ఎలాంటి బాపతు అని సర్వేలో ఆరా తీస్తే వీరంతా కరోనా నా గిరోనానా జాన్తనై అంతా కుట్ర , అది వచ్చిపోతుందంతే , మాస్కు లేదు తీస్కు లేదు అనే రకం అంట. ఈ సర్వే నిర్వాహకుల్లో ఒకరైన ప్రొఫసర్ బాబీ డఫీ మాత్రం వాక్సిన్ సైన్సు సాధించిన గొప్పవిషయాల్లో ఒకటని, దానిని వ్యతిరేకిస్తే కరోనా వ్యాప్తికి పెద్ద సమస్య కావచ్చనీ చెప్పారు. సర్వేలోని మిగతా వివరాల్లోకి వెడితే బ్రిటన్ లో 53 శాతం జనం మాత్రం వాక్సిన్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారట. మరో 16 శాతం మంది , వాక్సిన్ తాము తీసుకోకపోవచ్చని చెప్పారు కానీ నిర్ధారణగా చెప్పలేదు. 11 శాతం మాత్రం అమోమయంలో ఉన్నారట కానీ వీరంతా అప్పటికపుడు నిర్ణయం తీసుకోవచ్చు.మొత్తం మీద 20 శాతం జనం మాత్రం వ్యతిరేకంగానే ఉన్నారు. ఇక వ్యాక్సిన్ వద్దనే బాపతులో నాలుగు శాతం అయితే వాక్సిన్ ఎప్పటికీ రాదు అది హంబక్ అని కొట్టిపారేశారట. మొత్తంగా 44 శాతం జనం మాత్రం వాక్సిన్ సంవత్సరం లోపే అందుబాటులోకి వస్తుందని బావిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్యం సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు 26 కంపెనీలు వాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. అందులో అన్నింటి కన్నా ముందున్నది రష్యాకి చెందిన గామలేయా వాక్సిన్ , ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్. భారత్ లోను భారత్ బయోటెక్ , జైడిల్లా కంపెనీలు స్వంత వాక్సిన్ తయారుచేయడానికి సన్నాహాల్లో ఉన్నాయి. మంచి పరిణామం ఏంటంటే వాక్సిన్ త్వరగా అందుబాటులోకి తేవాలని ఎంత వత్తిడి ఉన్నప్పటికీ, తాము వాక్సిన్ తయారీ లో తీసుకోవాల్సిన అన్నిజాగ్రత్తలు, దశలు, ప్రయోగాలు పూర్తయ్యాకే వాక్సిన్ తీసుకువస్తామని భారత్ బయటెక్ అధిపతి కృష్ణ ఎల్లా చెబుతున్నారు. ఆక్స్ పర్డ్ యూనివర్సిటీతో వాక్సిన్ ఉత్పత్తి కోసం ఒప్పందం కుదుర్చుకున్న పూనే కి చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాక్సిన్ ధర 220 రూపాయలు అంటే భారత బయోటెక్ మాత్రం లీటర్ వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరలో వాక్సిన్ అందిస్తామని చెప్పింది. భారత్ దేశంలో వామపక్షీయులు గతంలో వాక్సిన్ లు వ్యతిరేకించిన బాపతే కానీ కరోనా విషయంలో కామ్ గానే ఉన్నారు. ప్రస్తుతం సైంటిస్టులు చెబుతున్న విషయాల ప్రకారం సామూహిక వ్యాధినిరోక శక్తి హెర్డ్ ఇమ్మూనిటీ రావాలన్నా జనాభాలో చాలా భాగం వ్యాక్సిన్ తీసుకోవల్సిందే.