యమదూతల్లా తాత్కాలిక డ్రైవర్లు... ఇప్పటివరకు పదిమంది మృతి...
posted on Oct 21, 2019 @ 12:24PM
ఆర్టీసీ సమ్మె కారణంగా తాత్కాలిక సిబ్బందిని నియమించుకుంటోన్న తెలంగాణ ప్రభుత్వం... ప్రజల భద్రతను మాత్రం గాలికొదిలేసింది. ముఖ్యంగా తాత్కాలిక డ్రైవర్లు ప్రజల పాలిట యమదూతల్లా మారుతున్నారు. తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతో సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. బస్సెక్కిన ప్రయాణికులు... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తుంటే... ఇక ప్రజలు రోడ్డుపక్కన నడవాలంటేనే భడుపడుతున్నారు.
ఆర్టీసీ సమ్మె ప్రారంభమైననాటి నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. బస్సులు బోల్తాపడటం, చెట్లను, వాహనాలను ఢీకొట్టడమే కాకుండా రోడ్డు పక్కన వెళ్తున్నవారిని సైతం వదలకపోవడంతో ఇప్పటివరకు 10మందికి పైగా మృతిచెందారు. ఇక, గాయపడినవారి సంఖ్య వందల సంఖ్యలో ఉంది. తృటిలో ప్రాణాలతో బయటపడ్డవాళ్లూ చాలా మందే ఉన్నారు. దాంతో ప్రజలు... ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే కాదు... బస్సు వస్తున్నప్పుడు రోడ్డు పక్కన నిలబడాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది.