చంద్ర బాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్
posted on Nov 4, 2023 @ 4:06PM
జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్నమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇవ్వాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయనతో బాటు ఈ భేటీలో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెళ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన కల్సి పోటీ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇటీవలే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిసి వచ్చారు. ఈ భేటీలో ఏపీలో ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్లు సమాచారం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై దాదాపు 50 రోజులకు పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. గత నెల 30న బెయిల్ 4 వారాల పాటు ఇంటర్మ్ బెయిల్ ను ఏపీ హై కోర్టు మంజూరు చేసింది. కంటి ఆపరేషన్ నిమిత్తం ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ తర్వాత ప్రత్యేక విమానంలో హైదారాబాద్ చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత భేటీ అవ్వడం తో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలనే కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. అదే సమయంలో బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతోంది. బిజెపితో పొత్తు ఖరారు కావడంతో తెలంగాణలో 9 స్థానాలకు జన సేన పోటీ చేస్తుంది. జనసేనాని బిజెపితో కల్సి ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు భేటి కావడం రెండు ఉభయ రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన పవన్, కంటికి జరుగుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం జైల్లో ములాఖత్ అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీపై ఇరు పార్టీల శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో - జనసేన పార్టీ అధినేత పవన్ భేటీలో తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలు ఈ భేటీలో చర్చించారు. త్వరలో తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయీ సమావేశాల నిర్వహాణపై ప్రస్తావనకు వచ్చింది. సీఐడీ పెడుతున్న వరుస కేసులపైనా వీరిరువురు చర్చించినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల లీడర్లు, కేడర్ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైనా చర్చించారు.
ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద చంద్రబాబు-పవన్ చర్చించినట్లు తెలుస్తుంది. పది అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని తెలుగుదేశం - జనసేన భావిస్తోంది. కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పన మీద చర్చించారు. కరవు, ధరల పెరుగుదల, కరెంట్ ఛార్జీల పెంపు, మద్యం, ఇసుక కుంభకోణాల వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి పోరాటాలు చేపట్టాలని తెలుగుదేశం - జనసేన భావిస్తోంది. పవన్ కల్యాణ్, లోకేశ్ రాజమహేంద్రవరంలోనే ఇటీవలి తెలుగుదేశం జనసేన రాజకీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. త్వరలో అమరావతిలో టీడీపీ-జనసేన మరొక విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.