పవన్ ఓడిపోవాలి: ఎవరిదీ కోరిక?
posted on Jun 3, 2024 @ 12:36PM
బిగినింగ్‌లోనే క్లారిటీ ఏంటంటే, కొంతమంది ఊహిస్తున్నట్టుగా, మరికొంతమంది ఆశిస్తున్నట్టుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోరు. ఎవరూ ఊహించనంత భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకోబోతున్నారు. లేటెస్టుగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ పవన్ కళ్యాణ్ భారీ విజయం ఖాయమని స్పష్టం చేశాయి. అయినప్పటికీ కొన్ని ‘శక్తులు’ పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని తపస్సు చేస్తున్నాయి. ఆ శక్తుల్లో వైసీపీ వాళ్ళు ఎలాగూ వుంటారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారంటే, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. రాష్ట్ర రాజకీయాలలో వైసీపీ ప్రాబల్యం బాగా తగ్గిపోయే అవకాశం వుంది. ఈ కారణం వల్ల వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకోవడం సహజమే. కానీ, పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకుంటున్నది మరెవరో కాదు... ఏ కాపులైతే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని కోరుకుంటూ వున్నారో, ఆ కాపుల్లోనే వున్న కొన్ని వర్గాలు.
కాపు సామాజికవర్గం వంగవీటి రంగా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఆయన హత్య కాపులకు పెద్ద షాక్ అయింది. ఆ తర్వాత వాళ్ళ ఆశలు దాసరి నారాయణరావు మీద కొంతవరకు మళ్ళినప్పటికీ, అవి బలపడలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించేసరికి కాపులలో ఉత్సాహం ఉరకలు వేసింది. తాము కోరుకుంటున్నట్టుగా ‘కాపు ముఖ్యమంత్రి’ అయ్యే అవకాశం చిరంజీవికి వుందని అనుకున్నారు. అయితే ఆ కలలు మధ్యలోనే కల్లలైపోయాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోయినప్పటికీ, రాబోయే కాలంలో అయినా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే శక్తి ఆయనకు వుందన్న నమ్మకం కాపులలో రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది కాపులు ఇలా ఆశలు పెట్టుకుంటే, కొంతమంది కాపులు మాత్రం అలా జరక్కూడదని, పవన్ కళ్యాణ్ గెలవకూడదని కోరుకుంటున్నారు.
అలా కోరుకుంటున్న వాళ్ళలో అగ్రస్థానంలో నిలిచే వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఇంతకాలం ఆయన ‘కాపు కార్డు’ దగ్గర పెట్టుకుని, దాన్ని క్రెడిట్ కార్డు వాడేసినంత ఈజీగా వాడేశారు. వైసీపీకి చేరువైన తర్వాత ఆ కార్డు వాడకం మరింత పెరిగి లిమిట్ దాటిపోయింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గెలిచారా.. ఇక కాపులు ముద్రగడని ఎంతమాత్రం పట్టించుకోరు. ‘కాపు కుల పెద్ద’ పోస్టు నుంచి ఆయన్ని తీసి పక్కన పెట్టేస్తారు. వారానికో పదిరోజులకో ఒకసారి అయినా ‘నమస్తే ముద్రగడ గారూ’ అని పలకరించేవారు కూడా వుండరు. పరిస్థితి ఇంత దారుణంగా మారే అవకాశం వుంది కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గెలవకూడదు దేవుడా అని మొక్కుకుంటూ వుంటారు.
ముద్రగడ మాత్రమే కాదు.. ప్రస్తుతం వైసీపీలో కాపు కుల ప్రతినిధులుగా వున్నవాళ్ళు, పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చే కాపు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గెలవకూడదనే వ్యక్తిగతంగా కోరుకుంటున్నారు. కాపు కులానికి పవన్ కళ్యాణ్ పెద్దదిక్కుగా మారిన తర్వాత వీళ్ళని పట్టించుకునేవాళ్ళే వుండరు.. అంతేకాదు.. వీళ్ళ నియోజకవర్గాల్లో కొత్త కాపు నాయకత్వం బయల్దేరుతుంది. దాంతో వీళ్ళు క్రమంగా రెండో స్థానానికి పడిపోయే ప్రమాదం వుంది. దాంతో వీళ్ళు కూడా ముద్రగడతో కలసి పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎవరెన్ని రకాలుగా కోరుకున్నా.. పవన్ కళ్యాణ్ గెలుపు అనివార్యం.