సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి... వారాహి సభలో పవన్ కళ్యాణ్!
posted on Oct 3, 2024 @ 7:01PM
తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి, తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకుని, తన దీక్షను విరమించారు. అనంతరం గురువారం సాయంత్రం ఆయన తిరుపతిలో వారాహి సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటించేవారంతా ఒక్క తాటిమీద నిలబడి బలంగా తయారవ్వాలని అన్నారు. తన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోనని అన్నారు. సనాతన ధర్మాన్ని పాటించేవాడు మత వివక్ష చూపించడు అని వారాహి సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను కౌలు రైతులకు సహాయం చేసేటప్పుడు మతం చూడలేదని.. క్రైస్తవులు, ముస్లిం రైతులకు సహాయం చేశానని ఆయన చెప్పారు. సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కడికి చులకనగా మారిందని, సనాతన ధర్మంపై దాడి చేస్తే దేశంలో సెక్కులరిస్టులు స్పందించరు.. కానీ ఇతర మతాలపై దాడి చేస్తే దేశ వ్యాప్తంగా అంతా స్పందిస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇతర మతాలపై దాడి చేస్తే అన్ని కోర్టులు స్పందిస్తాయి గానీ, సనాతన ధర్మంపై దాడి జరిగితే ఎవరూ స్పందించరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి అంతా ఐక్యం కావాలి. శ్రీరాముడిని దేశమంతా పూజిస్తుంది.. అదే శ్రీరాముడిని చెప్పులతో కొడితే మౌనంగా ఉంటాం. రాముడిపై అసత్య ప్రచారాలు చేసినా మౌనంగా ఉంటాం. దేశ మూల సంస్కృతికి వెన్నుముక శ్రీరాముడు.. రాముడు ఉత్తరాది వాడా? రాముడికి ప్రాంతం ఉంటుందా? కొందరు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కొత్త సిద్దాంతాలు తెరపైకి తెస్తున్నారు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోల్చిన ఉదయనిధి స్టాలిన్‌కి పవన్ కళ్యాణ్ తమిళంలోనే సమాధానం చెప్పారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సనాతన ధర్మంతోనే తన జీవితం ముడిపడి ఉందన్న పవన్ కళ్యాణ్, తాను హిందువునని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని అన్నారు. ‘‘ధర్మం కోసమే ఇప్పటివరకు నిలబడ్డా.. ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు.. అన్ని మతాలను సమానంగా చూస్తా.. నా కుమార్తె తిరుమలకు తీసుకెళ్లినందుకు డిక్లరేషన్ ఇప్పించా. తిరుమలలో నా చిత్తశుద్ధిని చూపించా. నన్ను విమర్శించే వాళ్లు ఒకటే గుర్తుంచుకోండి. పరాజయాలు పొందినా వెనక్కి తగ్గను. సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉంది’’ అన్నారు. జగన్‌కి ఈసారి 11 సీట్లు సరిపోలేదని, ఈసారి ఎన్నికల్లో జగన్‌ను ఒక సీటుకు పరిమితం చేస్తామని అన్నారు.