జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి... మళ్ళీ వెలుగులోకి వచ్చిన మైనర్ బాలిక రేప్ కేసు!
posted on Feb 12, 2020 @ 11:49AM
2017 ఆగస్టు 19న 15 సంవత్సరాల బాలిక మృతి కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. కర్నూలులో నగర శివారు లోని లక్ష్మీ గార్డెన్స్ లో ఉంటున్న ఎస్ రాజు నాయక్, ఎస్ పార్వతీదేవి దంపతుల 15 ఏళ్ల కుమార్తె ప్రీతి. ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో పదవ తరగతి చదివేది. 2017 ఆగస్టు 19 న ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపారు. తమ కుమార్తె ఉరివేసుకుని చనిపోలేదని స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం చేసిన వైద్యులు సైతం 2017 ఆగస్టు 20 న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ లో బాలికను రేప్ చేసినట్టు నిర్ధారించారు. పెథాలజీ హెచ్వోడీ డాక్టర్ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని తల్లితండ్రులు తెలిపారు. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లితండ్రులు తాలుకు పోలీసు స్టేషన్ లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యజమానితో పాటుగా అతడి కుమారుల పై ఫిర్యాదు చేశారు. నిందితుల పై పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన పై విచారణకు ముందుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. బాలిక శరీరం పై ఉన్న గాయాలను అక్కడి దృశ్యాల పట్ల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. విద్యార్థిని పై లైంగికదాడి చేసి హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. సాక్ష్యాలు బలంగా వుండటంతో నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లితండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఆధారాలు పక్కాగా ఉన్నా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దళిత సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాగా ఎలాంటి న్యాయం జరగలేదు.
దీంతో ఇదే విషయమై ఆమె జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. దీంతో ఈ ఘటన పై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు నగరంలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్నూలు జిల్లా ఏఎస్పీ పకీరప్ప తెలిపారు. సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. జస్టీస్ ఫర్ సుగాలి ప్రీతి అంటూ ఈ కేసు మళ్లీ ప్రాణం పోసుకొని బాలిక తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందేమో అన్న ఆశ వారిలో చిగురించింది. జగన్ సర్కార్ ఇలాంటి కామాందులను శిక్షిస్తుందో రక్షిస్తుందో వేచి చూడాలి.