పవన్ కళ్యాన్ రాజకీయ ప్రవేశంపై వేడివేడి తాజా వార్త!!!
posted on Mar 6, 2014 @ 6:49PM
పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పుడే ఒక వేడివేడి సమాచారం అందింది. ఆయన ఈ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టడం లేదు. కానీ, ఆ దగ్గరలోనే ఓ మంచి రోజు చూసుకొని ( బహుశః బుదవారం, ఏకాదశి) కొత్త పార్టీ ప్రకటించడం ఖాయమని అభిజ్ఞవర్గాల తాజా సమాచారం. మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు పార్టీని స్థాపిస్తున్నట్లు లాంచనంగా ప్రకటించినప్పటికీ, ఆయన మార్చి 12న రాజమండ్రీలో బహిరంగ సభలో కొత్తపార్టీ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పడం గమనిస్తే, ఆరోజు ఏకాదశి గనుక పవన్ కళ్యాణ్ కూడా అదే రోజు పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటిస్తారేమో!
ఇంతవరకు చిరంజీవి మరియు మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ పై పార్టీ పెట్టవద్దని తీవ్ర ఒత్తిడి తేవడం వలన ఆయన రాజకీయాలలోకి రాకపోవచ్చని వార్త ప్రచారంలోకి వచ్చినా, ముందే చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఒకసారి కమిట్ అయితే ఇక కష్టమయినా, నష్టమయినా వెనక్కి తగ్గరని నిరూపిస్తూ కొత్తపార్టీ స్థాపనకే సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇక కొత్త పార్టీ పేరు రిజిస్టర్ చేయించడం, లోగో, జెండా, అజెండా, మ్యానిఫెస్టో, తదితర ఏర్పాట్లన్నీఇప్పటికే పూర్తయిపోయాయని ఈలోగా మిగిలిన పనులు కూడా చక్కబెట్టి పార్టీని ప్రకటించాలని పవన్ కళ్యాణ్ మరియు ఆయన సన్నిహితులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇక అన్నిటికంటే మరొక ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, ప్రజారాజ్యం ప్రయోగం విఫలమవడంతో చాలా బాధపడిన పవన్ కళ్యాణ్ మన రాజకీయ వ్యవస్థలో తను చూసిన లోపాలను, వాటికి తనదయిన శైలిలో పరిష్కారాలు, రాజకీయ వ్యవస్థలో రావలసిన మార్పులు గురించి తన మనసులో భావనలకు అక్షర రూపం ఇచ్చారు. తన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇప్పుడు ఆయన వ్రాసిన పుస్తకావిష్కరణ కూడా చేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఏమయినప్పటికీ, పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంతో మళ్ళీ రాష్ట్ర రాజకీయాలలో కలకలం మొదలవడం ఖాయం. ఒకేసారి కిరణ్, పవన్ పార్టీలు ఆవిర్భవిస్తే ఇక రాజకీయాలలో సందడే సందడి.