ప్రజారాజ్యం సీక్వెల్ బై పవన్ కళ్యాణ్
posted on Sep 13, 2013 8:42AM
ఎప్పుడు సంచలన వార్తల కోసం పరితపించే మీడియా, మరో సంచలన వార్తతో ముందుకు వచ్చింది. రాష్ట్రంలోనే కాక, పొరుగు రాష్ట్రాలలో, చివరికి ప్రవాస ఆంధ్రులలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరించబోతున్నట్లు తాజా వార్త. అయితే దీనిని ఆయన దృవీకరించక పోయినప్పటికీ, ఆ పార్టీలో పనిచేసిన కొందరు నేతలు ద్రువీకరిస్తుట్లు మీడియా వార్త.
సమాజం పట్ల తనకు బాధ్యత ఉందని భావించే పవన్ కళ్యాణ్ లో కొంచెం ఆవేశం, ఆలోచన రెండూ కూడా ఎక్కువేనని అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల, రాష్ట్ర విభజన ప్రకటనతో అల్లకల్లోలంగా తయారయిన పరిస్థితులను చక్కదిద్దేందుకు తన వంతు కర్తవ్యం నిర్వర్తించాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఒక రాజకీయ వేదిక కూడా అవసరముంటుందని మాజీలు ఆయనకు నచ్చజెప్పడంతో, తిరిగి ప్రజారాజ్యం పార్టీకి ప్రాణం పోసి, దానికి తను నేతృత్వం వహించేందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ‘సామాజిక తెలంగాణా’, ‘సామాజిక న్యాయం’ అంటూ రెండు ప్రాంతాలలో పార్టీకి మద్దతు సంపాదించినప్పటికీ ఆ తరువాత ఆయన సమైక్య రాగం ఆలపించడంతో తెలంగాణాలో ఆ పార్టీ వెంటనే తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అది పవన్ కళ్యాణ్ అభిమానులపై ఎటువంటి ప్రభావం చూపలేదని స్పష్టమయింది.
కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాటం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే, అప్పుడు తెలంగాణాలో ఉన్న అభిమానులను ఆయన వదులుకొంటారా? లేక అభిమానులే ఆయనని వదులుకొంటారా అనేది పార్టీ ఏర్పరచడం ఖాయమయితే తేలవచ్చును. లేక ఆయన అందరి మనోభావాలు పరిగణనలోకి తీసుకొని ముందుగానే రెండు ప్రాంతాలలో విడివిడిగా శాఖలు తెరుస్తారా? అనేది కూడా ఈ వార్తలను ఆయన దృవీకరించిన తరువాతనే తేలుతుంది.
అయితే ఆయన సమైక్యవాదానికే మొగ్గు చూపుతున్నట్లు కొన్ని రుజువులున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమేరా మ్యాన్ గంగతో రాంబాబు’ సినిమా కూడా రాష్ట్ర ప్రజల మధ్య విభజనను వ్యతిరేఖిస్తూ తీయడం ఆయన వ్యక్తిగత అభిప్రాయాలకి అద్దంపడుతోందని, అందుకే ఇప్పుడు ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించినట్లు సమాచారం.
ఇక ఆ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలోధూర్తులయిన కొందరు రాజకీయ నేతలపై పోరాడేందుకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలని హైదరాబాదుకి రమ్మని పిలుపునిచ్చే సన్నివేశాలను, ఇటీవల హైదరాబాదులో జరిగిన ఏపీయన్జీవోల సభకు ముందు వాడుకోవడం వలన, సభకు వేలాది ప్రజలు స్వచ్చందంగా తరలిరావడం జరిగిందనే ప్రచారం కూడా ఉంది.
ఒకవేళ ఆయన సమైక్యవాదంతో పార్టీ గనుక స్థాపిస్తే, సీమాంధ్రలో గోడ మీద పిల్లులా కూర్చొని చూస్తున్న రాజకీయ పార్టీ నేతలందరూ కూడా ఆనాడు ప్రజారాజ్యం పార్టీలోకి దూకేసినట్లే, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలోకి దూకేయడం ఖాయం. కానీ అదే జరిగితే, చిరంజీవి హయంలో ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే దీనికి పట్టడం కూడా అంతే ఖాయం.
ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పునరుద్దరించదలచుకొంటే, ముందుగా రాష్ట్ర విభజనపై ఎటువంటి వైఖరి అవలంభించాలి, పార్టీలో ఎవరెవరిని తీసుకోవాలి, అభిమానులకే పెద్ద పీట వేయాలా లేక తలపండిన రాజకీయ నేతలకే పెద్ద పీట వేయాలా? తనే నాయకత్వం వహించాలా లేక వేరేవరయిన సమర్ధుడు, నిజాయితీపరుడుకి ఆ భాద్యతలు అప్పగించి తను వెనుకనిలబడి పార్టీని తన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా నడిపించడమా? వంటి అనేక అంశాలను ముందుగా నిర్ణయించుకోవడం మంచిది. ఏమయినప్పటికీ ఈ వార్తలు నిజమయినట్లయితే, రాష్ట్ర రాజకీయాలలో మరో కొత్త సంచలనం సృష్టించడం ఖాయం.
కొసమెరుపు: కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ రాష్ట్రానికి సరయిన నాయకుడని దర్శకుడు రాం గోపాల్ వర్మకొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసారు!