పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కబుర్లు
posted on Jul 21, 2013 @ 1:40PM
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కబుర్లు పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటి దారేది’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అభిమానుల మధ్య చాలా ఘనంగా జరిగింది. ఇటీవలే ఆయన మరో కొత్త సినిమాకు కూడా సంతకం చేశారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజ రవితేజకు సూపర్ హిట్ అందించిన ‘బలుపు’ సినిమాను నిర్మించిన నిర్మాత పరం. వీ. పొట్లూరి ఈ సినిమాను తన స్వంత బ్యానర్ ‘పీవీపీ సినిమా’ క్రింద చాలా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్నఒక ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఇవ్వనీ మామూలు విశేషాలే. కానీ ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది.
దీనిని నిర్మిస్తున్న పరం.వీ.పొట్లూరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. ఈయన ఆ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుండటమే కాక, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ తరపున పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి అన్నచిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా చక్రం తిప్పుతుంటే, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నిర్మిస్తున్నసినిమాలో నటిస్తున్నాడేమిటి? అని అప్పుడే కొందరు చెవులు కొరుకొంటున్నారు. నిర్మాత రాజకీయ నేపధ్యం తెలిసి కూడా అదేమి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ఆయన సినిమా చేయాలనుకొన్నారా? లేక అసలు ఆ సంగతే ఆయనకు తెలియదా? లేక తెలిసి ఉద్దేశ్యపూర్వకంగానే ఈ సినిమాకు ఒప్పుకొన్నారా? అనే ధర్మ సందేహాలకి పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాలి మరి.
ఇది వరకు, జూ.యన్టీఆర్ కొడాలి నాని నిర్మించిన సినిమాలలో నటించేవారు. వారిరువురు మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉండేవి. కానీ ఆ తరువాత కొడాలి నాని తెదేపా వీడి వైకాపలో జేరడం, అప్పుడు వారిరువురికి మధ్య స్నేహ సంబంధాలను అందరూ ప్రశ్నించడం, తదనంతర పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.
ఆ నిర్మాత కేవలం వైకాపా కార్యకర్తగా ఉన్నంతకాలం ఎటువంటి సమస్య రాకపోవచ్చును. కానీ ఒకవేళ ఆయన ఎన్నికలలో పోటీ చేస్తూ చిరంజీవిని విమర్శించితే, మరి అప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏమిటి? అప్పుడు కొనసాగుతుందా లేక అటకెక్కుతుందా? తెలుగు సినిమా రంగంలో కూడా రాజకీయపార్టీల వలన చీలిక ఏర్పడిన కారణంగా ఇటువంటి అనుమానాలు తలెత్తడం సహజమే.