ఎన్ఐఏ కు సాయపడింది పాకిస్థానీయులేనట..
posted on Apr 8, 2016 @ 12:06PM
పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురు కమెండోలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాదులే అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చెబుతున్నా.. పాకిస్థాన్ నుండి వచ్చిన జిట్ బృందం మాత్రం అదంతా వట్టిదే అని.. అసుల ఈ దాడికి పాల్పడింది ఆ దేశానికి చెందినవారే అంటూ మాటమార్చుతున్నారు. అయితే అసలు దాడికి దిగింది పాకిస్థాన్ జాతీయులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎలా గుర్తించింది? అంత ఖచ్చితంగా పాకిస్థాన్ ఉగ్రవాదులే దాడి చేశారు అని చెప్పడానికి కారణం.. పాకిస్థాన్ కు చెందిన వారే ఎన్ఐఏ అధికారులకు ఫోన్లు చేసి ఉగ్రవాదులు ఎవరన్న విషయాలను వెల్లడించారట.
అసలు సంగతేంటంటే.. దాడి జరిగిన అనంతరం.. ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్న పాక్ వంటకాల ప్యాకెట్లు, సెల్ ఫోన్ సంభాషణలు ఆధారంగా వారు పాకిస్థాన్ కు చెందిన వారని నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే చనిపోయిన నలుగురు ఉగ్రవాదుల ఫొటోలను తమ వెబ్ సైట్ లో పెట్టిన ఎన్ఐఏ... వారి గురించిన వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరింది. దీనిలో భాగంగానే.. పలు వారికి పలు దేశాలతో పాటు పాకిస్థాన్ నుండి కూడా కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఉగ్రవాదులు ఎవరన్న విషయం అధికారులకు వెల్లడించారు. కానీ పాక్ మాత్రం వాటన్నింటిని తోసిపుచ్చి మరోసారి తన కపటబుద్దిని చూపిస్తూ.. అసలు ఎన్ఐఏ అధికారులు తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని చెప్పేసింది.