Read more!

హతవిధీ ఇంకేం దారి.. దిక్కుతోచని స్థితిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్!

నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏం బాగాలేదు.  సినిమా కష్టాల్లా అన్ని కష్టాలూ ఆయనకే వస్తున్నాయనిపిస్తోంది.  మంత్రిగా ఉండగా..  అనిల్ కుమార్ యాదవ్ ఓ  రేంజ్ లో చెలరేగిపోయాడు. తన పర బేధం లేకుండా  అందర్నీ దూరం చేసుకున్న ఫలితం,  ఆ మంత్రి పదవి కాస్తా హుష్ కాకి అయిన తర్వాత.. ఆయనకు తెలిసివస్తోందంటున్నారు.

మంత్రిగా ఉండగా   ఆయన వెంట అడుగులో అడుగు వేసి జై కొట్టిన వారంతా..ఇప్పుడు ఆయన కంటికి కూడా కనిపించకుండా దూరం జరిగారని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని సైతం ఆయన చాలా లైట్ తీసుకున్నారని.. ఇంకా చెప్పాలంటే.. ఆయన ఎంపిక చేసిన వారి ఇళ్లకే వెళ్లి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారనే చర్చ సైతం జిల్లా పార్టీ వర్గాల్లో వైరల్ అవుతోందని సమాచారం. ఈ కార్యక్రమంలో కూడా అనిల్ తోపాటు అతి కొద్దిమంది మాత్రమే పాల్గొంటున్నారని.. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎం జగన్‌కు నివేదిక అందిందని... అందుకే ప్రాంతీయ సమన్వయ కర్త పదవి నుంచి ఆయన్ని తప్పించారనే టాక్ సైతం  హాట్ హాట్‌గా నడుస్తోంది.

 మరోవైపు ఎన్నికలు సీజన్.. దూసుకొచ్చేస్తోంది. అలాంటి సమయంలో పనంతా కేడర్‌తోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కేడర్‌ కోసం.. కేడర్‌ను తన చుట్టు తిప్పుకోవడం కోసం.. అనిల్ ఇప్పటికే రంగంలోకి దిగి.. లక్షలాది రూపాయిలు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.
 ఇంకో సీఎం జగన్ తన..  తొలి కేబినెట్‌లో అనిల్ కుమార్ యాదవ్‌కు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చాన్స్ ఇచ్చారని... అయితే మంత్రిగా ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ బాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడి   జగన్ వద్ద మంచి మార్కులే కొట్టేశారని.. ఆ క్రమంలో   జిల్లాలోని పార్టీ సీనియర్ నేతలతోనే కాదు.. సీనియర్ ఎమ్మెల్యేలతో సైతం అనిల్..  డొంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించేవారని.. చెబుతున్నారు. జగన్ గుడ్ లుక్స్ లో ఉన్నందున మలి కేబినెట్ లో కూడా తన స్థానం పదిలం అన్న ధీమాతో ఉండేవారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  

అయితే తనకు మంత్రి పదవిని ఊడబీకి జిల్లాకే చెందిన   కాకాణి గోవర్దన్ రెడ్డికి జగన్ మలి కేబినెట్‌లో స్థానం కల్పించడాన్ని జీర్ణించుకోలేకపోయిన అనిల్ కుమార్ యాదవ్  అప్పట్లో వ్యవహరించిన తీరుతో  జగన్ గుడ్ లుక్స్ కు దూరమయ్యారంటారు.  మంత్రిగా ఉన్న సమయంలో  అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలే.. పార్టీలో ప్రస్తుతం ఆయన ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి రావడానికి కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అదీకాక.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పి. నారాయణ బరిలో దిగే అవకాశం ఉందని.. అలాంటి పరిస్థితుల్లో  వైకాపా అభ్యర్థిగా... మరింత బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని  జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లో పార్టీ టికెట్ దక్కదన్న ఆందోళన మొదలైందని పార్టీ వర్గాలే అంటున్నాయి.   ఇప్పటికే  నెల్లూరు జిల్లాలో వైసీపీ గ్రాఫ్ భారీగా పడిపోయిందనీ, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్ లోనే మద్దతు కోల్పోయిన అనీల్ కుమార్ యాదవ్ కు మరోసారి టికెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఏదీ ఏమైనా.. అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేస్తారా? లేక వెంకటగిరి నుంచి బరిలోకి దిగుతారా? లేదంటే శాసన మండలికి పంపిస్తారా? అనేది  ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయిస్తారంటున్నారు. ఇవేమీ కూడా ఇవ్వకుండా జగన్  ఆయనకు రిక్తహస్తం చూసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.