Read more!

వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్ ను ఎత్తుకెళ్లారు!

గ్రేట్ ట్రెయిన్ రాబరీ అని ఓ హాలీవుడ్ సినిమా ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచింది. ఆ సినిమాలో ట్రైన్ లో రవాణా అవుతున్న నిధిని దొంగ చాకచక్యంగా చోరీ చేసి అందరి దృష్టిలో హీరోగా నిలుస్తాడు. ఇదే కాదు.. రాబిన్ హుడ్ లా పెద్దలను దోచి పేదలకు పెంచే దొంగలను హీరోలుగా చిత్రిస్తూ పలు తెలుగు సినిమాలు వచ్చాయి.

అలాంటి సినిమాలన్నిటినీ తలదన్నే లాంటి చోరీ ఒకటి జరిగింది. ఇక్కడ దొంగలు చోరీ చేసింది డబ్బునో, నగలనో కాదు.. ఏకంగా ఒక సెల్ టవర్ ను. అది కూడా ఏ అర్దరాత్రో అపరాత్రో కాదు. పట్ట పగలు. ఇటీవలి కాలంలో ఏటీఎంలను ఎత్తుకెళ్లిపోయిన దొంగల గురించి విన్నాం.. కానీ ఏకంగా సెల్ టవర్ ను ఎత్తుకుపోయిన దొంగలను మొదటి సారి చూస్తున్నాం.

బీహార్ లో ఈ వింత దొంగతనం జరిగింది. సెల్ టవర్ ఎత్తుకు వెళ్లిన వారు ఏదో దొంగచాటుగా రాలేదు. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులమంటూ వచ్చి దర్జాగా పట్టపగలే ఎత్తుకెళ్లారు. చోరీ చేస్తున్నామన్న భయం కానీ, దొరికిపోతామేమోనన్న బెదురు కానీ వారిలో ఏ కొసానా కనిపించలేదు. టవర్ తీసేయడానికి కారణం తమ సెల్ ప్రొవైడర్ కంపెనీ నష్టాల ఊబిలో కూరుకుపోవడమేనని అడిగిన వారికి చెప్పారు. అందరూ చూస్తుండగానే భారీ టవర్ కు కిందకు పడుకోపెట్టి.. ఏ పార్టుకాపార్టు విడదీసి చక్కా పట్టుకుపోయారు. దీని విలువ పాతిక లక్షలకు పైనే ఉంటుందని చెబుతున్నారు.

అంతా అయిన తరువాత కంపెనీవారికి సమాచారం అందడంతో వారు వచ్చి ఇది దొంగల పనేనని తేల్చారు. పట్నాలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ కు గత కొన్ని నెలలుగా కిరాయి కట్టడం లేదన్న విషయం తెలుసుకున్న ఓ దొంగల ముఠా దానికి చోరీ చేసేందకు పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. అందర్నీ నమ్మించి, అందరూ చూస్తుండగానే తమ పని చక్క పెట్టేసింది.