Read more!

జనసేన గూటికి మేకతోటి

అధినేత ఆమెను మామూలుగా అవమానించారా? తొలి కేబినెట్ లో ఏకంగా హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆమెను ఎంతో గౌరవ స్థానంలో కూర్చోబెట్టినట్టే కూర్చోబెట్టి ఆ తర్వాత అవమానకరంగా మంత్రి పదవి ఊడబెరికారు. దీంతో అలక వహించిన ఆ కీలక నేత కొన్నాళ్లు మౌనమే తన  భాష అన్నట్లు గడిపారు. ఆపైన జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలకు కూడా రాం.. రాం.. చెప్పేశారు.  అయినా కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్నారు. తాజాగా పలువురు పార్టీ జిల్లాల అధ్యక్షులు, సమన్వయ కర్తలను మార్చిన అధినేత ఆ జిల్లా బాధ్యతలను డొక్కా మాణిక్య వరప్రసాద్ కు అప్పగించారు.  మాజీ మంత్రి మేకతోటి సుచరిత చాన్నాళ్లుగా వైసీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హోం మంత్రిగా వైసీపీలో ఒక వెలుగు వెలిగిన తనకు పార్టీలో రోజు రోజుకూ ప్రాధాన్యం తగ్గిపోతున్న తీరును ఆమె గమనిస్తున్నారు.

మంత్రి పదవి పోగొట్టుకుని, జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్న క్రమంలో వైసీపీలో సుచరిత యాక్టివ్ గా కనిపించలేదు. అయినప్పటికీ తనను వైసీపీ  పెద్దలు కానీ.. మరెవరు కానీ కనీసం పలకరించలేదనే బాధ సుచరితలో   గూడుకట్టుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల సమయానికి ముందే సంచలన నిర్ణయం తీసుకునేఅవకాశాలున్నాయని అంటున్నారు. ఆ దిశగా సుచరిత ఇప్పటికే కసరత్తు ఆరంభించేశారని గుంటూరు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో.. రాజకీయంగా తన ఉనికిని ఎలా కాపాడుకోవాలనే దానిపై, మళ్లీ ఎలా యాక్టివ్ కావాలనే అంశాల పైన సుచరిత దృష్టిసారిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి, వేరే పార్టీ తీర్థం తీసుకోవాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సుచరిత వైసీపీని వీడితే ఆమెకు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటనే చర్చ గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుచరితకు ఉన్న ఆప్షన్లలో ఒకటి నారా చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ.. వైసీపీతోనూ, ఆ పార్టీ చీఫ్ జగన్ తోనూ నువ్వా.. నేనా.. అనే రీతిలో ఢీకొనగల సత్తా ఉన్న పార్టీ. టీడీపీలో చేరితే.. వైసీపీని ఢీకొనగలిగే శక్తి తనకు వస్తుందనే యోచన సుచరిత చేస్తున్నారని అంటున్నారు.

కాగా.. వైసీపీ నుంచి తప్పుకున్నా టీడీపీలో చేరే అవకాశం అంతగా ఉండకపోవచ్చనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే పలు వేదికలపై సుచరిత సుతిమెత్తగా అయినా.. టీడీపీపై విమర్శలు చేశారు. అందుకే ఆమె ఇప్పుడు  పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ వైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే.. ఆ పార్టీ తరఫున ఈసారి ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బరిలో దిగాలనే ఆకాంక్షను సుచరిత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓకే అంటే.. వెనుకా ముందూ చూడకుండా జనసేన పార్టీ కండువా కప్పుకునేందుకు ఈ మాజీ హోం మంత్రి సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు వస్తున్నాయి.

గుంటూరు జిల్లాలో కీలకంగా ఉండే ఎస్సీ నియోజకవర్గం ప్రత్తిపాడులో గత ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేయడంతో జగన్ కుటుంబం ఆమెను ఎంతో ముఖ్యమైన నాయకురాలిగా భావించింది. అందువల్లే సుచరితకు జగన్ తొలి కేబినెట్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హోం మంత్రి పదవి వరించింది. తదననంతర పరిణామాలలో ఏం జరిగిందే తెలియదు కానీ ఇటీవలి కాలంలో సుచరితకు వైసీపీలో ఎటువంటి ప్రాధాన్యతా లభించడం లేదు.