పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే.. పీవోకే మీద అయితేనే జరుపుతాం : ప్రధాని మోదీ
posted on May 12, 2025 @ 9:07PM
పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే.. అది ఉగ్రవాదం మీద, పీవోకే మీద అయితేనే జరుపుతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు దాడి చేస్తే మా పద్ధతిలో వారి మూలలను గుర్తించి సంహరిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను మేము వేరు వేరుగా చూడం.. మా దృష్టిలో ఇద్దరు ఒక్కటే ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసింది. భారత మిస్సైళ్లు పాక్ రక్షణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసేశాయి. పాక్ గర్వంగా చెప్పుకునే మిస్సైళ్లు, రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత్ మిస్సైళ్లు విధ్వంసం సృష్టించాయి. పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగరలేని స్థితిని భారత్ కల్పించింది అని మోదీ పేర్కొన్నారు.
పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పింది. భారత్ ప్రతిచర్యలకు బెంబేలెత్తిన పాక్.. కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా చెప్పాయి. ఉగ్రవాదంపై భారత్ షరతులు మేరకే చర్చలు ఉంటాయి. భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు ఉంటాయని మోదీ స్పష్టం చేశారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చారించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ఇది యుద్ధాల యుగం కాదు.. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు.