ఓయూలో ఉద్రిక్తత.. స్టూడెంట్స్ ఆందోళన
posted on Mar 25, 2021 @ 12:53PM
ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వర్సిటీ సిబ్బందితో గొడవ పడుతున్నారు. పోలీసులు వచ్చినా పట్టు వీడటం లేదు. ఇంతకి ఓయూ విద్యార్థుల ఆందోళనకు కారణం ఏంటో తెలుసా? స్టూడెంట్స్ ఆందోళన ఏ ఉద్యమం కోసమో, ఉద్యోగాల కోసమో కాదు. హాస్టల్ కోసం. అవును, తమను హాస్టల్స్‌లో ఉండనీయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. యూనివర్సిటీని ఉద్రిక్తంగా మార్చేశారు.
కరోనా విజృంభిస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు బంద్. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. అందులో భాగంగా ఓయూలో కాలేజీలు, హాస్టళ్లు, క్యాంటీన్లు మూసేస్తున్నారు వర్సిటీ అధికారులు. అయితే.. ఈ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు హాస్టల్స్ క్లోజ్ చేస్తే తాము ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. క్యాంటిన్స్ మూసేస్తే తమ పరిస్థితి ఏంటంటూ నిలదీస్తున్నారు. అందుకే, కాలేజీలు మూసినా పర్వాలేదు కానీ, హాస్టల్స్, క్యాంటీన్స్ బంద్ చేస్తే ఊరుకునేది లేదని గొడవ చేస్తున్నారు. హాస్టల్ గదులను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తే.. అందుకు విద్యార్థులు సహకరించడం లేదు. ఓయూ సిబ్బంది చర్యలకు నిరసనగా విద్యార్థి సంఘాలు వర్సిటీలో ఆందోళనకు దిగాయి.
కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు హాస్టల్స్, మెస్ క్లోజ్ చేస్తున్నామని అందుకు స్టూడెంట్స్ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. విద్యార్థులు మాత్రం అందుకు ఒప్పుకునేది లేదని, హాస్టల్స్‌లోనే ఉంటామంటూ పట్టుబడుతున్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్స్ యధావిధిగా నడుస్తున్నా పట్టించుకోవడం లేదు కానీ, పేద విద్యార్థులు ఉండే ఉస్మానియా హాస్టల్స్‌ను మాత్రం బలవంతంగా మూసి వేయడం ఏంటని నిలదీస్తున్నారు. బార్లు, వైన్లు, మాళ్లు, థియేటర్లలో లేని కరోనా రూల్స్.. ఓయూ హాస్టల్స్‌కే వర్తిస్తాయా? అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు క్యాంపస్‌కు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.