ఓ.ఆర్.ఓ.పి. పై ప్రధాని మోడీ వివరణ
posted on Sep 6, 2015 @ 10:48PM
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారంనాడు ఫరీదాబాద్ లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానంలో స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన సైనికులకి కూడా ఈ పధకం వర్తిస్తుందని స్పష్టం చేసారు. “గత 42సం.లుగా ఈ సమస్యని పరిష్కరించలేనివారు కూడా దీనిపై ప్రజలలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేశం కోసం తమ ప్రాణాలను పణంగాపెట్టి పోరాడుతున్న మన వీరజవాన్ల పట్ల మా ప్రభుత్వానికి చాలా గౌరవం ఉంది. అందుకే మేము అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఈ సమస్యపై లోతుగా అధ్యయనం చేసి, ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానం అమలు చేస్తున్నాము,” అని తెలిపారు.
గత 84 రోజులుగా దీని కోసం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేస్తున్న మాజీ సైనికులు తమ దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కానీ వారి ప్రతినిధి మేజర్ జనరల్ (రిటైర్డ్) సత్బీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
రక్షణమంత్రి మనోహర్ పార్రికర్ బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ, “మాజీ సైనికులు చిరకాల కోరిక అయిన ‘ఒకే హోదా-ఒకే పెన్షన్ విధానం’ అమలుచేస్తున్నాము. ఏ విషయంలోనయినా నూటికి నూరు శాతం సమస్యలన్నీ ఒకేసారి తీరిపోవు. మాజీ సైనికులకు మేము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొన్నామనే విషయాన్ని వారికీ తెలుసు. కనుక వారు ప్రభుత్వంతో సహకరించినట్లయితే మిగిలిన అన్ని సమస్యలను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చును,” అని అన్నారు.