ఆన్ లైన్ సర్వేల్లో కమలం వికాసం! గ్రేటర్ లో దుబ్బాక సీన్ రిపీట్ కానుందా?
posted on Nov 30, 2020 @ 2:57PM
హైదరాబాద్ యూత్ మార్పు కోరుకుంటుందా? ఉద్యోగులు, విద్యావంతులు టీఆర్ఎస్ సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నారా? కేసీఆర్ సర్కార్ కు షాకివ్వాలని నగరవాసులు డిసైడయ్యారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఆన్ లైన్ సంస్ఠలు నిర్వహిస్తున్న పోల్ సర్వేలో ఇదే స్పష్టమవుతోంది. ఆన్ లైన్ పోల్ సర్వేల్లో గ్రేటర్ పీఠం బీజేపీకి దక్కడం ఖాయమని తేలుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. గ్రేటర్ ఎన్నికలపై నిర్వహిస్తున్న ఆన్ లైన్ పోల్ కు భారీ స్పందన వస్తుండగా.. దాదాపు అన్ని సర్వేల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యతిరేకతే కనిపిస్తోంది.
ఉద్యోగులు, విద్యావంతులు, ప్రొఫెషనల్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆన్ లైన్ సర్వేల్లో ఎక్కువగా వారే పాల్గొంటారు. విద్యావంతుల అభిప్రాయం తెలిసే వేదికగా భావించే అన్ లైన్ పోల్ సర్వేల్లో జీహెచ్ఎంసీలో కమలం స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు మీడియాలో టాప్ ఆన్ లైన్ సంస్థ తెలుగువన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమల వికాసం ఖాయమని తేలింది. తెలుగు వన్ ఆన్ లైన్ పోల్ లో దాదాపు 50 వేల మంది పాల్గొని తమ అభిప్రాయం పంచుకున్నారు. ఇందులో దాదాపు 60 శాతం అంటే 30 వేల మంది బీజేపీనే జీహెచ్ఎంసీలో గెలుస్తుందని చెప్పారు. అధికార టీఆర్ఎస్ మళ్లీ విజయం సాధిస్తుందని కేవలం 26 శాతం మందే ఓటేశారు. తెలుగువన్ సర్వేలో ఏడు శాతం మంది టీడీపీకి, మూడు శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.
కేసీఆర్ సర్కార్ పనితీరుపై యువత అసంతృప్తిగా ఉన్నారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం, గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం వంటి అంశాలపై యువతి, యువకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు కూడా టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారు. పీఆర్సీ ప్రకటించకపోవడం, ప్రమోషన్లు, బదిలీల్లో నిర్లక్ష్యంపై వారు బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పెండింగ్ సమస్యలతో పాటు కరోనా సమయంలో జీతాల్లో కోతలు పెట్టడంపైనా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ప్రొఫెషనల్స్ కూడా గులాబీ పార్టీ పనితీరుపై హ్యాపీగా లేరని చెబుతున్నారు. ఈ అంశాలే తెలుగు వన్ ఆన్ లైన్ పోల్ సర్వేల్లోనూ స్పష్టమైంది. నెటిజన్ల తీరులానే సామాన్యుల తీర్పు కూడా ఉంటే గ్రేటర్ లో కారుకు భారీ కుదుపు ఖాయమనే చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నికపై తెలుగు వన్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ సర్వే నిజమైంది. దుబ్బాకలో అధికార పార్టీనే గెలుస్తుందని ఎక్కువ మంది భావించారు. మెజార్టీ సర్వేలు కూడా అదే చెప్పాయి. కాని తెలుగు వన్ సర్వేలో మాత్రం బీజేపీకి గెలవబోతుందని వచ్చింది. తెలుగు వన్ సర్వేపై అప్పుడు కొందరు విమర్శలు కూడా చేశారు. కాని ఎన్నికల ఫలితాల్లో మాత్రం తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తెలుగు వన్ ఆన్ లైన్ పోల్ నిజం కాబోతుందని, బీజేపీ గెలవబోతుందనే చర్చ జరుగుతోంది.
నిజానికి ఈసారి గ్రేటర్ ఎన్నికల పోరు అత్యంత హోరాహోరీగా సాగింది. ప్రచారంలో గతంలో ఎప్పుడు లేనంతగా పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. స్థానిక అంశాలు కాకుండా రోహింగ్యాలు, పాకిస్తాన్, సర్జికల్ స్ట్రైక్ వంటి అంశాలే గ్రేటర్ ప్రచారంలో కీలకంగా మారాయి. వివిధ పార్టీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలతో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. హైదారాబాద్ లో అల్లర్లకు కుట్రలు జరుగుతున్నాయని , నగరాన్ని కాపాడుకోవాల్సి ఉందంటూ గ్రేటర్ ఓటర్లలో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్. ఈ నేపథ్యంలో హైదరాబాదీలు ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు , ప్రొఫెషనల్స్ తమకు అండగా ఉంటారని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే తెలుగు వన్ సర్వేలో మాత్రం నెటిజన్లు బీజేపీకే జై కొట్టడంతో ఇప్పుడు కారు పార్టీలు నేతలు కలవరపడుతున్నట్లు చెబుతున్నారు.