మార్చి 2.. మహమ్మారి రోజు..
posted on Mar 2, 2021 @ 10:28AM
మార్చి రెండు. మరచి పోలేని, మరవ కూడని రోజు. గత ఏడాది ఇదే రోజున తెలంగాణలో కరోనా మహమ్మారి కాలు పెట్టింది, ఇదే రోజున రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఈ సంవత్సర కాలంలో, సుమారు మూడు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 1,635 మందిని కొవిడ్ మహమ్మారి బలి తీసుకుంది. ఇంకా ఇప్పటికీ రాష్ట్రంలో సుమారు 2 వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ రోజుకూ వందకు పైగానే కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకరో ఇద్దరో అయినా కన్నుమూస్తున్నారు.
ప్రపంచంలో మరణమృదంగం మోగించిన కరోనా మహమ్మారి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల నామమాత్రపు హానితోనే బయటపడిందని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా కాలుపెట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా, మహమ్మారిపై పోరులో, ముందుండి పోరాటం చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ను మంత్రి అభినందిచారు. “సొంత వారు కూడా దగ్గరికి రాని సమయంలో ప్రేమ, ఆప్యాయతలతో ధైర్యంగా చికిత్స అందించిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, హెల్త్ వర్కర్స్ కి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు కరోనా మహమ్మారి పై పోరాటం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు” అంటూ అయన అభినందించారు.
ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం కూడా తోడు కావడంతో కరోనా పై పోరాటం కూడా ఉద్యమ స్థాయిలో నడిచి జనజీవనం ఏడాది తిరగకుండానే సాధారణ స్థాయికి చేరుకుంది. కరోనా మహమ్మారి లాంటి ఆరోగ్య విపత్తు సంభవించినా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని, అనుభవాన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుంది. వాక్సిన్ ఒక్కటే ఈ మహమ్మారిని పారద్రోలడానికి మన ముందున్నశాశ్వత పరిష్కారం అన్నారు మంత్రి. భయాందోళనలు వీడి ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా, ప్రభుత్వం సూచించిన సలహాలు సూచనలు పాటిస్తూ మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం కొనసాగించాలని విజ్ఞప్తి మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు.
ఈ సంవత్సర కాలంలో కరోనా మహమ్మారి మహా విపత్తునే సృష్టించింది. మనుషుల మధ్య గోడలు కట్టింది. దురాన్ని పెంచింది. చివరకు చివరి చూపులకు కూడా నోచుకోలేని విషాదాన్ని మిగిల్చింది. అందుకే ఇది మరిచి పోలేని, మరిచి పోకూడని రోజు.