దేశంలో ఒక్క రోజే 30 శాతం కేసులు హైక్.. మెట్రో నగరాల్లో వెరీ డేంజర్!
posted on Dec 31, 2021 @ 10:03AM
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. కొత్త వైరస్ విజృంభణతో దేశంలో కొత్త కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా 10 వేలకు దిగువనే నమోదవుతున్న కేసులు.. గురువారం 16 వేలకుపైగా చేరాయి. ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గురువారం ఒక్కరోజే 16,764 కొవిడ్ కేసులు నమోదు కాగా.. అందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270. ఒక్క రోజులోనే కొత్త వేరియంట్ కేసులు 30 శాతం మేర పెరిగాయి. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్.. 23 రాష్ట్రాలకు వ్యాపించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 450 కేసులుండగా.. ఢిల్లీలో ఆ సంఖ్య 320కి చేరింది.
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నిన్న 12 లక్షల మందికిపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 16,764 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ్ బెంగాల్‌లో కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 91,361కి చేరాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి మరోసారి పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో వైరస్ విస్తృతి ఎక్కువగా ఉంది. ఢిల్లీ, ముంబయి నగరాల్లో కొవిడ్ ఆర్-విలువ (రీ-ప్రొడక్షన్ రేటు) 2 దాటినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఈ నగరాల్లో వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరించారు.
కొవిడ్ ఇన్‌ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ (R Factor) ద్వారా అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 1గా ఉంటే ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి సరాసరి మరొకరికి సోకుతున్నట్లు పరిగణిస్తారు. 1 కంటే తక్కువగా ఉంటే మాత్రం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు భావిస్తారు. అయితే, దేశంలో కొవిడ్ విస్తృతిపై చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (IMS) ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ముంబయి, ఢిల్లీ నగరాల్లో ఈ విలువ 2 దాటినట్లు తాజా అధ్యయనంలో వెల్లడించింది.
డిసెంబర్ 23-29 తేదీల మధ్య దిల్లీలో ఆర్-విలువ 2.54గా నమోదు కాగా, ముంబయిలో 2.01గా నమోదైంది. పుణె, బెంగళూరు నగరాల్లో ఆర్ విలువ 1.11గా నమోదు కాగా కోల్‌కతాలో 1.13, చెన్నైలో 1.26గా రికార్డయినట్లు ఐఎంఎస్ శాస్త్రవేత్త సితభ్రా సిన్హా పేర్కొన్నారు. అక్టోబర్ రెండోవారం తర్వాత ఈ నగరాలన్నింటిలో ఈ ఆర్ విలువ 1 కంటే ఎక్కువగా ఉంది. కానీ, వాస్తవం ఏంటంటే.. దిల్లీ, ముంబయి నగరాల్లో తాజాగా ఆర్-విలువ 2 దాటడం తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఐఎంఎస్ శాస్త్రవేత్త సితభ్రా సిన్హా అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో ఒక్కరోజే కొత్తగా 923 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 86 శాతం కేసులు పెరిగాయి. అక్కడ ఈ తరహా కొవిడ్ ఉద్ధృతి పెరగడం మే 30 తర్వాత ఇదే మొదటిసారి. దిల్లీలో డిసెంబర్ 20న కేవలం 91 కేసులు నమోదు కాగా 30వ తేదీ ఒక్కరోజే 923కు పెరిగింది. ఇదే మాదిరిగా ముంబయిలోనూ కొవిడ్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. ఒక్కరోజే 2,510 కేసులు నమోదయ్యాయి. మే 8 తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఊహించని పరిణామం. ఇక ఢిల్లీలో నమోదవుతున్న కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్‌వే ఉన్నాయని.. అందుకే అక్కడ సామాజిక వ్యాప్తి జరిగి ఉండొచ్చని ఢిల్లీ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది.