అయ్యో...ఆమె గొర్రెలకాపరి అనుకునేరు!
posted on Sep 20, 2022 @ 10:41AM
ఆరోగ్యం కోసం, ఉల్లాసంగా ఉండేందుకు ఇటీవలికాలంలో వయసుతో నిమిత్తంలేకుండా జాగింగ్ పట్ల అంతా ఆకర్షితులయ్యారు. గ్రామాల్లో ఉండేవారికి ఇబ్బంది లేదు. పట్టణాల్లో,పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారే జాగింగ్ ట్రాక్ ఉన్నపార్కులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఒకరిని అనుసరించి చాలామంది జాగింగ్ ట్రాక్స్ పిచ్చిలో పడుతున్నారు. కానీ అంతే వేగంగా చేయాలనేమీ లేదు. ఎవరికి వీలుగా వారు చేయాలనే అంటున్నారు డాక్టర్లు కూడా. అయితే గ్రామాల్లో పరుగులు తీసేవారు, జాగింగ్ పేరుతో పొలాల్లో తిరిగే వారు మాత్రం రవ్వంత జాగ్రత్తగానే ఉండాలి. గేదెలో, మేకలో, కుక్కలో వెంటపడినా పడవచ్చు.
ఫ్రాన్స్‌లో ఒక గ్రామంలో ఒకామె జాగింగ్ పేరుతో అలా తిరిగివద్దామని అనుకుంది. చాలాదూరం వెళ్లింది. కొంతసేపయ్యాక చూస్తే ఆమె దాదాపు అటవీప్రాంతంలోకి వెళ్లింది. చెట్లు, చల్లటిగాలి ఎంతో హాయిగా ఉందని ఓ క్షణం ఆగింది. చుట్టూ చూసింది. ఒక్కసారిగా భయపడింది. కారణం ఆమె వెనుక గొర్రెల మంద ఉంది. ఆమె కదిలిగే అవీ కదులుతున్నాయి. అవి తనని ఫాలో అవుతున్నాయని అప్పటికి గాని ఆమె గ్రహించలేకపోయింది. ఆ గొర్రెల కాపరి ఎటు వెళ్లాడో తెలీదు, ఇవి మాత్రం ఆమెను తమ కాపరి అనుకు న్నాయో ఏమోగాని ఆమె వెంటపడ్డాయి. ఆమేమీ ఎర్రటి దుస్తుల్లో లేదు, పోనీ వెంటాడటానికి. కొద్దిగా భయ పడి ఆగిపోయింది. చెట్టుకింద క్షణం కూచుని మెల్లగా బయలుదేరింది.
కొంతదూరం వెళ్లే సరికి వాటిలో కొన్ని మళ్లీ ఆమె వెనకే వస్తుండడం గమనించింది. ఈసారి నిజంగానే ఆమె ఆగిపోయి అవి ఎవరివో తెలుసుకోవాలనుకుంది. ఓర్నాయనో ఇవన్నీ తన ఇంటిదాకా వస్తే ఏం కావా లి? అనుకుంది. ఎవరో కనిపిస్తే పిలిచింది. కానీ ఎవరూ ఆమె పిలుపు పట్టించుకోలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆమె వెంట గొర్రెలు ఫాలో అవడం మాత్రం వీడియో తీసి తర్వాత నెట్‌లో పెట్టాడు. ఇపుడు దానికి వేలల్లో అభిమానులు తయారయ్యారు. ఇదో పెద్ద కామెడీ సీన్ అని పేరు పెట్టుకున్నారు. చూడ్డా నికి అదేదో సినిమాలో మోడర్న్డ్రస్ వేసుకున్న హీరోయిన్ వెంట కుక్కలు పడినట్టు వీక్షకులకు అనిపించింది. కాలక్షేపానికి వారికి బాగానే దొరికిందనుకున్నారు. కానీ ఆమె మాత్రం భయంతో ఒణికి పోయింది. వాటి యజమాని వచ్చి తనను తిడతాడేమోనని, ఎందుకంటే అవి తననే అనుసరిస్తు న్నా యి మరి. ఆమె వాటిని మందుపెట్టి తన వెంట తీసుకువచ్చానని అనుకుంటే పెద్ద కేసే అవుతుంది కదా!
మొత్తానికి తేలిందేమంటే, ఆ గొర్రెల మంద అటవీప్రాంతంలో తప్పిపోయాయి. ఆమెను చూసి గ్రామం లోకి వెళ్లే తమ యజమాని అనుకున్నాయి. ఆమె వెళుతోంటే వెంటపడింది ఆ మంద!