చంద్రబాబుకి ఆ అర్హత లేదా?
posted on Apr 6, 2013 @ 6:31PM
వైకాపా మొదలు పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ నాటకంలో క్రమంగా పాత్రదారులు పెరుగుతున్నారు. అందరూ తలో చేయి వేసి మంచి రసవత్తరంగా నడిపిస్తున్న ఈ డ్రామాలో స్వర్గీయ యన్టీఆర్ మీద పేటెంట్ హక్కులున్న తానూ మాత్రం ఎందుకు పాలుపంచుకోకూడదని ఎన్టీర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నేడు ప్రవేశించారు.
కేవలం ఆవు గురించే తెలిసిన పిల్లాడికి ఏ ప్రశ్న అడిగినా దానికి జవాబు ఆవుతోనే ముగించినట్లు, విషయం ఏదయినప్పటికీ చివరికి చంద్రబాబును ఆడిపోసుకోవడంతోనే సంబాషణ ముగించే లక్ష్మీపార్వతి, వైకాపా ఫ్లెక్సీలో తన భర్త స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటో గురించి తెదేపా నేతలు అభ్యంతరాలు తెలుపుతుంటే, తన ప్రియ శత్రువు చంద్రబాబును ఎండగట్టడానికి ఇంత కంటే మంచి అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అన్నట్లు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి “అసలు నా భర్త ఫోటో వాడుకొనే హక్కును తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కోల్పోయింది. అయినప్పటికీ, గత్యంతరం లేక ఆయన బొమ్మను పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. ఆయన కుమారుడు బాలకృష్ణకు తన తండ్రి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఆయన తన తండ్రికి అన్యాయం చేసిన చంద్రబాబు పంచన చేరారు. నా భర్త మీద అభిమానం ఉన్న వారెవరయినా ఆయన ఫోటో పెట్టుకోవచ్చును. అందులో తప్పేమీ లేదు. కానీ, తెలుగుదేశం పార్టీ కి మాత్రం ఆ హక్కు లేదు. నిజంగా చంద్రబాబుకు తన నాయకత్వం మీద అంత గొప్ప నమ్మకం దైర్యం ఉంటే, ముందు నా భర్త స్వర్గీయ యన్టీఆర్ ఫోటోను తీసేసి ఆ స్థానంలో తన ఫోటోను పెట్టుకొని ఎన్నికలకి వెళ్ళమనండి. ఏమవుతుందో అప్పుడు ఆయనే చూస్తారు,” అని లక్ష్మీ పార్వతి ఆవేశపడిపోయారు. ఇంకా మిగిలిన పాత్రదారులు, ముఖ్యంగా మన బాద్షా రేపయినా ప్రవేశిస్తారో లేదో చూడాలి.