ఇప్పుడిక వైసీపీలో కొత్త రచ్చ? జగన్ కు చుక్కలు కనిపించడం ఖాయం!
posted on Feb 8, 2025 @ 1:35PM
విజయసాయి రాజకీయ సన్యాసం ప్రకటించి రెండు వారాలు గడిచిపోయింది. విజయసాయి నిష్క్రమణపై వైసీపీ మౌనం వహించింది. ఆ మౌనంలో భయమే ఎక్కువ కనిపించింది. విజయసాయి రాజీనామాపై వైసీపీకి మాత్రమే చేతనైన తీరులో విమర్శలు రాకపోవడానికి కారణం కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న భయమేనని పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే విజయసాయి రాజకీయ సన్యాసం, వైసీపీకి రాజీనామాపై ఆ పార్టీ నేతల మౌనం.. రెండు రోజుల కిందట బద్దలైంది. విజయసాయి వ్యక్తత్వం, విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ జగన్ మీడియా సమావేశంలో చెప్పిన తరువాత ఇక వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా విజయసాయిపై విమర్శలతో ముందుకు వస్తున్నారు. అంత కంటే ముందు షర్మిల విజయసాయికి మద్దతుగా జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారనుకోండి అది వేరే సంగతి. ప్రస్తుతానికి వస్తే షర్మిల విమర్శలపై నోరు విప్పే ధైర్యం వైసీపీలో జగన్ సహా ఎవరికీ లేదన్నది తెలిసిందే.
ఇక మిగిలింది విజయసాయి. విజయసాయి జగన్ క్యారెక్టర్ కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన తరువాత వైసీపీ నుంచి తొలి సారిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నోరు విప్పారు. ఒక సామాన్య ఆడిటర్.. ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదగడానికి, పార్టీలో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తికి క్యారెక్టర్ ఉన్నట్లా, లేక ఆ పదవులన్నీ అనుభవించి, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి తన దారి తాను చూసుకున్న వ్యక్తికి క్యారెక్టర్, విశ్వసనీయతా ఉన్నట్లా అని ప్రశ్నించారు. పార్టీ వీడిన తరువాత పార్టీ అధినేతపైనా, పార్టీపైనా చెడుగా మాట్లాడటమే అతని స్వభావాన్ని తెలియజేస్తున్నదని నేరుగా పేరు ప్రస్తావించకుండానే విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు కేతిరెడ్డి. వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న మీ ప్రయత్నం వెనుక ఎవరున్నారో తెలుసు అంటూ ఆయన చేసిన ట్వీట్ రానున్న రోజులలో మరింత మంది వైసీపీయులు విజయసాయిపై నోరు పారేసుకునేందుకు రూట్ క్లియర్ చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే జరిగి వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డిగా విమర్శల పర్వం కొనసాగితే.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి వెల్లడించే విషయాలు వైసీపీ కొంప ముంచడమే కాకుండా, జగన్ కు కూడా కంటిమీద కునుకులేకుండా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. వైసీపీలో ఈ కొత్త రచ్చ ఎంత తొందరగా మొదలైతే అంత తొందరగా జగన్ ఆస్తుల కేసు విచారణ జోరందుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. విజయసాయిరెడ్డిపై వైసీపీ నుంచి ఎంత తీవ్రంగా విమర్శలు వస్తే జగన్ రాజకీయ, న్యాయ వ్యవహారాలపై అంత తీవ్రంగా ప్రతికూల ప్రభావం ఉండటం ఖాయమంటున్నారు. ఈ పరిస్థితిని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.