Read more!

ఊపిరితిత్తిల్లో ముక్కుపుడ‌క‌!

మామ్మ‌గారు పోపుడ‌బ్బాలో రూపాయికాసు దాచుకున్నారు, పిల్ల‌డు చాక్లెట్‌ని జామెట్రీబాక్స్‌లో, అమ్మ జెడ పిన్ను చెవివెన‌క‌, పింకీ ర‌బ్బ‌రుబ్యాండ్ బుక్‌లో దాచుకున్నారు. జో లికిన్స్ అనే ఆయ‌న ముక్కు పుడ‌క మాత్రం ఆయ‌న ఊపిరితిత్తుల్లో దాక్కుంది!   

లికిన్స్ చాలాకాలంనుంచి ద‌గ్గుతో ఇబ్బందిప‌డుతున్నాడు. మామూలు ద‌గ్గు మందులు వేసుకుంటున్నా అదేమీ త‌గ్గ‌క‌పోగా మ‌రింత స‌మస్య‌గా మారింది. ఏ ప‌నీ చేసుకోలేని స్థితికి వ‌చ్చాడు. ఇటీవ‌లే ఇక లాభం లేద‌ని పెద్దాస్ప‌త్రికి ఒక స్నేహితుడి స‌హాయంతో వెళ్లాడు. అక్క‌డ అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేసి ఆప‌రేష‌న్ చేయాల‌న్నారు. 

రెండురోజుల త‌ర్వాత ఎక్స్‌రే తీస్తే లికిన్స్ గ‌త ఐదేళ్లుగా వెతుకుతున్న ముక్కు పుడ‌క ఆయ‌న ఊపిరి తిత్తుల్లోనే ద‌ర్శ‌న‌మిచ్చింది. డాక్ట‌ర్లు ముందు న‌వ్వుకున్నారు. జోకులేసుకున్నారు. ఆన‌క కొంత భ‌యాన్ని వ్య‌క్తం చేశారు. ఎందుకంటే ఆ మ‌హానుభావుడికి అది అక్క‌డున్న సంగ‌తే తెలియ‌లేదు. నొప్పి కూడా లేదు. కేవ‌లం ద‌గ్గుతున్నాడు. అంతకు మించి అదృష్ట‌మేమంటే అది క‌ద‌ల‌కుండా ఉండ‌డం. ఊపిరి తిత్తిని చీల్చ‌కుండా ప‌డి ఉండ‌డ‌మే అత‌న్ని బ‌తికించింద‌న్నారు. అది విని లికిన్స్ భ‌య‌ ప‌డ్డాడు. 

తాను ఎంతో ఇష్టంగా చేయించుకుని ఫ్యాష‌న్‌గా ముక్కుకు అలంక‌రించుకున్నాడు. కానీ ఐదేళ్ల క్రితం పోయింది. అది ఎలా పోయింద‌న్న‌ది అత‌నికీ తెలియ‌లేదు. ఇల్లంగా వెతికాడు, తోటంతా వెతికాడు. బెడ్ రూమ్‌లో ఉన్న రెండు బెడ్‌ల‌నూ కింద‌ప‌డేసి మ‌రీ చూశాడు. అయినా క‌నిపించ‌లేదు. ఇద్ద‌రు మ‌నుషు ల‌ను పెట్టి వెతికించాడు. అయినా ల‌భించ‌లేదు. కానీ ఇన్నాళ్లు ఇబ్బందిపెడుతున్న ద‌గ్గు  ఊపిరితిత్తు ల్లో దాగిన ముక్కుపుడ‌కే కార‌ణ‌మన్న‌ది డాక్ట‌ర్లే చెప్ప‌గ‌లిగారు. 

చాలాకాలం త‌ర్వాత ఈ విధంగా దొరికిన ముక్కుపుడ‌క చూసి న‌వ్వుకున్నాడు, త‌న ప్రాణం తీయ‌కుండా ఉన్నందుకు ముద్దెట్టుకుని భ‌ద్రంగా సొరుగులో దాచుకున్నాడు. మ‌రంచేత, ఫ్యాష‌న్‌కి  ముక్కు పుడ‌క‌లు ధ‌రించే  యువ‌తీ యువ‌కుల్లారా  బ‌హు ప‌రాక్!