ఉత్తరాంధ్ర పులి అయ్యన్నపాత్రుడు.. ప్యాలెస్ పిల్లి జగన్.. నారా లోకేష్
posted on Nov 3, 2022 @ 11:04AM
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్టుపై తెలుగుదేశం భగ్గు మంది. అయ్యన్న పాత్రుడి అరెస్టు దుర్మార్గమంటూ విమర్శలు గుప్పించింది. తుగ్గక్ సీఎం తప్పులను ప్రశ్నించిన తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండి పడింది.
దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగల్లో గోడలు దూకి ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నారని విమర్శిస్తున్నారు. దేశ స్వాతంత్య్రానికి ముందు జైళ్లన్నీ స్వాతంత్ర్య సమరయోధులతో నిండిపోయేవనీ, ఇప్పుడు జగన్ పాలనలో రాష్ట్రంలోని జైళ్లన్నీ తెలుగుదేశం నేతలతో నిండిపోతున్నాయనీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ ఒక పిరికి పంద అన్నారు.
ఉత్తరాంధ్ర పులి అయ్యన్న పాత్రులు అయితే తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ తప్పుల్ని ఎత్తి చూపుతున్న అయ్యన్న పాత్రుడిని చూసి భయంతో వణికిపోయిన తాడేపల్లి ప్యాలెస్ పిల్లి జగన్ ఆయనను అర్ధరాత్రి అరెస్టు చేయించిందని లోకేష్ విమర్శించారు.
అర్దరాత్రి పోలీసులు దొంగల్లా చొరబడి గోడ కేసులో అయన్నపాత్రుడు, రాజేష్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడికి అండగా మొత్తం తెలుగుదేశం పార్టీ ఉందన్నారు.
చెత్త మీద పన్నేసిన చెత్త పాలకుడికి పోయేకాలం దగ్గర పడిందని లోకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో తెలుగుదేశం నాయకుడు దూళిపాళ్ల అయ్యన్న పాత్రుడి అరెస్టును అనైతిక చర్యగా అభివర్ణించారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసలు వైసీపీ దుర్మార్గాలను, జగన్ రెడ్డి అవినీతిని ఎండగడుతున్నారన్న అక్కసుతోనే అయ్యన్నపై పాలకులు కక్షగట్టారని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు పనులు మానుకోకుంటే జగన్ రెడ్డిని ప్రజలే తరిమికొట్టే రోజు దగ్గరలోనే వస్తుందన్నారు. ఇక మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అయ్యన్న అరెస్టును తీవ్రంగా ఖండించారు. జగన్ మార్క్ దురాగతాలు,దురన్యాయాలు పాసిష్టు పాలనకు అయ్యన్న అరెస్టు ఒక నిదర్శనమన్నారు.